కోట్ల రూపాయల నిధులు వరదపాలు

కోట్ల రూపాయల నిధులు వరదపాలు

నల్లగొండ జిల్లాలో అధికారులు, నేతల తప్పుడు నిర్ణయాలతో కోట్ల రూపాయలు నీటిపాలయ్యాయి. నిబంధనలు పాటించకుండా నిర్మాణం చేపట్టిన అర్బన్ పార్క్ వర్షాలకు నీటిలో మునిగిపోయింది. అధికారుల నిర్లక్ష్యమే ఇందుకు కారణమని మండిపడుతున్నారు జనం. 
నల్లగొండ జిల్లా కేంద్రానికి దగ్గరలోని చర్లపల్లి చెరువు పరిధిలో నిర్మిస్తున్న అర్బన్ పార్క్ వర్షాలకు ఆగమైంది. 90 శాతానికి పైగా నీట మునిగింది.ఇందులో యోగా కేంద్రం, వాకింగ్, సైక్లింగ్ ట్రాక్ లు,  పిల్లల ఆటస్థలాలు, అడ్వెంచర్ గేమ్స్, ఫుడ్ కోర్టులతో పాటు మరిన్ని సౌకర్యాలు ఉండేలా ప్లాన్ చేశారు. ఇప్పటివరకు మూడున్నర కోట్లకు పైగా ఖర్చు పెట్టారు. అయితే సాధారణ వర్షానికే స్విమ్మింగ్ పార్కుగా మారింది అర్బన్ పార్క్. నిధులన్నీ నీటిపాలయ్యాయి. 
చెరువు పరిధిలో అర్బన్ పార్క్ నిర్మించడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని మండిపడుతున్నారు జనం. అధికారుల తప్పుకు కోట్ల రూపాయల ప్రజా ధనం వరద పాలైందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.అర్బన్ పార్క్ తో పాటు  ట్యాంక్ బండ్, శిల్పారామం నిర్మాణాల విషయంలోనైనా అధికారులు ముందు జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు జనం. పట్టణంలో కొనసాగుతున్న రోడ్డు విస్తరణ పనులు వేగం పెంచి వెంటనే పూర్తి చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. వాహనదారులకు ఇబ్బందులు లేకుండా రోడ్డు నిర్మాణ ప్రాంతాల్లో హెచ్చరిక బోర్డులు పెట్టాలని వారు సూచించారు.