మూసీ బాగుపడితే... రేవంత్ పర్మినెంట్ సీఎం అయితడనే భయం! : ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి

మూసీ బాగుపడితే... రేవంత్ పర్మినెంట్  సీఎం అయితడనే భయం! : ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి
  •     మురికి కూపంలోనే బతుకుదామా.. అభివృద్ధి వద్దా?: చామల

హైదరాబాద్, వెలుగు: మూసీ ప్రక్షాళన చేస్తే రేవంత్ రెడ్డి ఎప్పటికీ సీఎంగా ఉంటారని భయపడి బీఆర్ఎస్, బీజేపీ వాళ్లు అభివృద్ధిని వ్యతిరేకిస్తున్నారని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. ఆదివారం మంత్రి వాకిటి శ్రీహరి, విప్ బీర్ల అయిలయ్య, డైరీ డెవలప్‌‌‌‌మెంట్ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి, మదర్ డెయిరీ చైర్మన్ మధుసూదన్ రెడ్డితో కలిసి ఆయన అహ్మదాబాద్ సబర్మతి రివర్ పరివాహక ప్రాంతాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా చామల మాట్లాడుతూ.. గుజరాత్‌‌‌‌లో సబర్మతి నదిని 22 కిలోమీటర్ల మేర ప్రక్షాళన చేశారని తెలిపారు. సబర్మతి రివర్‌‌‌‌‌‌‌‌కు ఎస్టీపీల నుంచి, నర్మదా నది నుంచి వచ్చే నీళ్లను పంటలకు పంపిస్తున్నారన్నారు. 

హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న మూసీని కూడా ప్రక్షాళన చేసి, గోదావరి నీళ్లను తెచ్చి కలపాలని రేవంత్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు. మరోవైపు, సబర్మతి రివర్ ప్రక్షాళనకు తీర ప్రాంతంలో ఉన్న పది వేల కుటుంబాలను తరలించామని అక్కడి అధికారులు చెప్పారన్నారు. ఎవరిని తరలించలేదని బీజేపీ స్టేట్‌‌‌‌ చీఫ్‌‌‌‌ రాంచందర్‌‌‌‌‌‌‌‌రావు అబద్ధాలు చెబుతున్నారని ఫైర్ అయ్యారు. హరీశ్‌‌‌‌ రావు, రాంచందర్‌‌‌‌‌‌‌‌రావు అహ్మదాబాద్ వచ్చి, అధికారులతో మాట్లాడి, సబర్మతి రివర్‌‌‌‌‌‌‌‌ను చూసి వాస్తవాలు తెలుసుకోవాలని హితవు పలికారు. మనం హైదరాబాద్ మూసీ నదిని ప్రక్షాళన చేసుకోవద్దా? మూసీ మురికి కూపంలోనే బతుకుదామా.. అని ఆయన ప్రశ్నించారు.