పేదోళ్ల పొట్ట కొట్టొద్దు..ఆ భూముల్లోనే ఇండ్లు కట్టియ్యాలె : సీపీఎం నేత బీవీ రాఘవులు

పేదోళ్ల పొట్ట కొట్టొద్దు..ఆ భూముల్లోనే ఇండ్లు కట్టియ్యాలె : సీపీఎం నేత బీవీ రాఘవులు
  • ఖమ్మం బాధితులకు తక్షణమే న్యాయం చేయాలే..  సీఎంకు రాఘవులు లేఖ

హైదరాబాద్, వెలుగు: ఖమ్మం కార్పొరేషన్ పరిధిలోని వెలుగుమట్ల భూదాన్​ భూముల్లో పేదల ఇండ్ల కూల్చివేతపై సీపీఎం నేత బీవీ రాఘవులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇండియా కూటమిలో భాగస్వాములుగా ఉండి బుల్డోజర్ సంస్కృతిని వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్.. రాష్ట్రంలో మాత్రం పేదలపై అమానుషంగా వ్యవహరించడం దారుణమని మండిపడ్డారు. ఖమ్మం బాధితులకు న్యాయం చేయాలని కోరుతూ ఆదివారం సీఎం రేవంత్ రెడ్డికి ఆయన బహిరంగ లేఖ రాశారు. వెలుగుమట్ల పరిధిలో 12 ఏండ్ల నుంచి నివాసముంటున్న సుమారు 700 మంది పేదల ఇండ్లను అధికారులు కూల్చేశారని పేర్కొన్నారు. 

అవి భూదాన్​ యజ్ఞ బోర్డుకు చెందిన భూములని, 2014లోనే పేదలకు 100 గజాల చొప్పున కేటాయించినట్లు తెలిపారు. ఆ ప్రాంతాన్ని తాను సందర్శించానని, అక్కడ పరిస్థితి యుద్ధం, భూకంపం వల్లనో నాశనమైనట్లుగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. విలువైన భూముల పేరుతో పేదలను రోడ్డున పడేయడం సరికాదన్నారు. పేదలను ఎక్కడి నుంచైతే ఖాళీ చేయించారో అదే భూముల్లో వారికి పక్కా ఇండ్లు నిర్మించి ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.