శంషాబాద్ ఎయిర్ పోర్టు లో పలు విమానాల రద్దు

శంషాబాద్ ఎయిర్ పోర్టు లో పలు విమానాల రద్దు
  •     గల్ఫ్  ప్రయాణికుల అవస్థలు

శంషాబాద్, వెలుగు: ఇరాన్, ఇజ్రాయెల్ – అమెరికా మధ్య నెలకొన్న యుద్ధ వాతావరణం కారణంగా విమానయాన సంస్థలు తమ సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేశాయి. భద్రతా కారణాల దృష్ట్యా విమాన మార్గాలను మార్చడం లేదా రద్దు చేయడం వంటివి చేస్తున్నాయి. తాజా పరిణామాల ప్రకారం ఆదివారం శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి గల్ఫ్, అరబ్  దేశాలకు వెళ్లే సర్వీసులు నిలిచిపోయాయి. శంషాబాద్  నుంచి వివిధ దేశాలకు వెళ్లాల్సిన 23 విమాన సర్వీసులు రద్దయ్యాయి. అదేవిధంగా వివిధ దేశాల నుంచి హైదరాబాద్‌‌‌‌కు రావాల్సిన 21 విమాన సర్వీసులు కూడా నిలిచిపోయాయి. 

దుబాయ్, దోహా (ఖతార్), కువైట్, దమ్మమ్, సౌదీ అరేబియా, షార్జా, అబుధాబి, జెడ్డా, మస్కట్  దేశాలకు వెళ్లాల్సిన 23 విమాన సర్వీసులు రద్దయ్యాయి. కాగా.. ముందస్తు సమాచారం లేకుండా విమానాలు రద్దు కావడంతో ఎయిర్ పోర్టులో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఇతర దేశాలకు వెళ్లాల్సిన ప్రయాణికులు తమ కనెక్టింగ్ ఫ్లైట్స్  మిస్  అవుతున్నామని ఆందోళన చెందుతున్నారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన ప్రయాణికులు ఎయిర్ పోర్టులోనే పడిగాపులు కాస్తున్నారు.