- పదోన్నతుల కోసం దాదాపు 400 మంది నిరీక్షణ
- జిల్లా నుంచి లిస్టులు వచ్చినా కమిషనరేట్‌లో పెండింగ్
- పీఆర్, ఆర్డీ కమిషనరేట్‌లో కమిటీల పేరుతో కాలయాపన
- కొత్త మండలాల్లో సీనియర్ అసిస్టెంట్ పోస్టులూ ఖాళీగానే
హైదరాబాద్, వెలుగు: పంచాయతీరాజ్ శాఖ పరిధిలోని జిల్లా, మండల పరిషత్ కార్యాలయాల్లో పనిచేస్తున్న జూనియర్ అసిస్టెంట్ల పదోన్నతుల ప్రక్రియ అటకెక్కింది. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 200కు పైగా సీనియర్ అసిస్టెంట్ పోస్టులు, 60కి పైగా పర్యవేక్షకుల పోస్టులు ఖాళీగా ఉన్నా.. ప్రమోషన్లు కల్పించడంలో కమిషనరేట్ కార్యాలయం నిర్లక్ష్యం వహిస్తోంది. 2018 నుంచి గడిచిన ఎనిమిదేండ్లుగా ఈ ప్రక్రియ పెండింగ్ పడడంపై ఉద్యోగులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాల నుంచి సీనియారిటీ జాబితాలు వచ్చి ఏండ్లు గడుస్తున్నా, జోనల్ వారీగా జాబితాను ఖరారు చేయడంలో ఉన్నతాధికారులు విఫలమవుతున్నారు.
ఇదే శాఖలోని సీఈఓ, డిప్యూటీ సీఈఓ, ఎంపీడీఓలకు చకచకా పదోన్నతులు కల్పిస్తున్న ప్రభుత్వం.. క్షేత్రస్థాయిలో కీలకంగా వ్యవహరిస్తున్న జూనియర్ అసిస్టెంట్ల పట్ల సవతి తల్లి ప్రేమ చూపుతున్నారనే విమర్శలు వస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా దాదాపుగా 400 మందికిపైగా జూనియర్ అసిస్టెంట్లు ప్రమోషన్ల కోసం పెట్టుకున్న ఆశలు ఆడియాశలే అవుతున్నాయి. ఈ క్రమంలో చాలా మంది జూనియర్ అసిస్టెంట్లు అదే హోదాలో రిటైర్ అవుతున్నారు. తాజాగా కొత్తగా స్క్రూటినీ కమిటీని తెరపైకి తెచ్చి కాలయాపన చేస్తున్నారని ఉద్యోగులు మండిపడుతున్నారు.
25 ఏండ్లుగా అదే క్యాడర్లో..
ప్రమోషన్ల ప్రక్రియ ఏండ్లుగా పెండింగ్‌లో ఉండటంతో ఉద్యోగుల పరిస్థితి దయనీయంగా మారింది. సుమారు 25 ఏండ్ల సర్వీసు పూర్తిచేసుకున్న వారు కూడా చేరిన క్యాడర్‌లోనే (జూనియర్ అసిస్టెంట్‌గానే) పదవీ విరమణ చేయాల్సి వస్తుందని ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. జిల్లాల వారీగా సీనియారిటీ జాబితాలను సిద్ధం చేసి కమిషనరేట్‌కు పంపి ఏండ్లు గడుస్తున్నా.. జోనల్ వారీగా జాబితాను రూపొందించడంలో అధికారులు విఫలమవుతున్నారు. ఏండ్ల తరబడి ఒకే హోదాలో పనిచేస్తూ ప్రమోషన్ రాక సిబ్బంది తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నారు.
కమిటీల పేరుతో కాలయాపన..
ప్రమోషన్లు ఎప్పుడు ఇస్తారని అడిగితే అధికారులు గడువు మీద గడువు విధిస్తూ దాటవేస్తున్నారు. గతేడాది డిసెంబర్ 31 లోపు ఇస్తామని.. ఆ తర్వాత సంక్రాంతికి అని, ఆపై మున్సిపల్ ఎన్నికల కోడ్ అని సాకులు చెబుతూ కాలం వెళ్లదీస్తున్నారని వాపోతున్నారు. కోడ్ ముగిసి చాలా రోజులైనా.. ఇప్పుడు కొత్తగా స్క్రూటినీ పేరుతో మరో కమిటీని ఏర్పాటు చేసి ఉద్దేశపూర్వకంగా కాలయాపన చేస్తున్నారనే విమర్శలు వస్తన్నాయి. కాలయాపన చేయడం తప్ప పదోన్నతులు కల్పించడంతో ఆఫీసర్లకు చిత్తశుద్ధి లేదని ఉద్యోగ సంఘాలు మండిపడుతున్నాయి.
అదేశాఖలో పనిచేస్తున్న ఉన్నతాధికారులకు, కింది స్థాయి సిబ్బందికి మధ్య ప్రభుత్వం, కమిషనరేట్ చూపుతున్న వివక్షపై ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం డిప్యూటీ సీఈవోలను సీఈవోలుగా, ఎంపీడీవోలకు డిప్యూటీ సీఈవోలుగా ప్రమోషన్లు కల్పించింది. పై స్థాయి ఉద్యోగులు సంబరాలు చేసుకుంటుంటే.. కిందిస్థాయి ఉద్యోగులను పట్టించుకోవడం లేదని జూనియర్ అసిస్టెంట్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అదనపు బాధ్యతలతో పని ఒత్తిడి
రాష్ట్ర ప్రభుత్వం 2024 నవంబర్‌లో కొత్తగా 30 మండలాలను ఏర్పాటు చేసింది. ఈ మండలాలకు ఎంపీడీఓలను నియమించినప్పటికీ, ఇప్పటికీ కార్యాలయ మినిస్టీరియల్ సిబ్బంది పోస్టులను మంజూరు చేయలేదు. సీనియర్ అసిస్టెంట్ల పోస్టులు భర్తీ చేయడం లేదు. అంతేకాకుండా, పొరుగు మండలాల నుంచి సిబ్బందిని డిప్యూటేషన్‌పై తీసుకునేందుకు ఆఫీసర్లు ప్రయత్నిస్తున్నారు.
ఇప్పటికే ఆయా మండలాల్లో స్టాఫ్ కొరత ఉండగా.. ఇప్పుడు అదనపు బాధ్యతలు అప్పగిస్తుండటంతో అదనపు పనిభారంతో సిబ్బంది తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి తక్షణమే సీనియారిటీ జాబితాను ఖరారు చేసి అర్హులైన జూనియర్ అసిస్టెంట్లకు సీనియర్ అసిస్టెంట్లుగా పదోన్నతులు కల్పించాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు.
