ఈ ఏడాదీ మెగా టోర్నీల జోరు! నేషనల్ గేమ్స్ ఆతిథ్య హక్కుల కోసం ఐఓఏకు రాష్ట్ర సర్కారు విజ్ఞప్తి

ఈ ఏడాదీ మెగా టోర్నీల జోరు! నేషనల్ గేమ్స్ ఆతిథ్య హక్కుల కోసం ఐఓఏకు రాష్ట్ర సర్కారు విజ్ఞప్తి
  • ఇప్పటికే  ప్రపంచ కప్ హాకీ విమెన్స్ 
  • క్వాలిఫయర్ మ్యాచ్‌‌‌‌‌‌‌‌ల నిర్వహణకు ఏర్పాట్లు
  • సెప్టెంబరులో రోయింగ్  ఆసియా 
  • చాంపియన్‌‌‌‌‌‌‌‌షిప్ నిర్వహణకు కసరత్తు
  • హైదరాబాద్ ఇంటర్నేషనల్ చెస్ 
  • ఫెస్టివల్, జాతీయ ఖోఖో పోటీలు పూర్తి 

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ పర్యవేక్షణలో ఈ ఏడాది తెలంగాణ మరెన్నో  ప్రతిష్టాత్మక జాతీయ, అంతర్జాతీయ మెగా టోర్నమెంట్‌‌‌‌లకు వేదిక కాబోతోంది. నిరుడు గచ్చిబౌలి స్టేడియం వేదికగా ఇంటర్  కాంటినెంటల్ ఫుట్‌‌‌‌బాల్ కప్ తో పాటు 15 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత అంతర్జాతీయ బ్యాడ్మింటన్  చాంపియన్‌‌‌‌షిప్‌‌‌‌  పోటీలను విజయవంతంగా నిర్వహించింది. ఇక ఈ ఏడాది ప్రణాళికల్లో భాగంగా ఈనెలలో ప్రపంచకప్  హాకీ విమెన్స్  క్వాలిఫైయర్  మ్యాచ్‌‌‌‌లను నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసింది.   

అదేవిధంగా సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో అండర్ 19, 23 విభాగాల్లో రోయింగ్  ఆసియా చాంపియన్‌‌‌‌షిప్  నిర్వహణకు సంబంధిత ఫెడరేషన్‌‌‌‌కు ఆసక్తి వ్యక్తీకరణ లేఖను పంపింది.  ఈ ఏడాదే జాతీయ ఖోఖో పోటీలతో పాటు  రూ.24 కోట్ల బడ్జెట్‌‌‌‌తో హైదరాబాద్  ఇంటర్నేషనల్  చెస్  ఫెస్టివల్‌‌‌‌ను నిర్వహించారు. భవిష్యత్తులో నేషనల్​ గేమ్స్​ ఆతిథ్య హక్కుల కోసం ఇండియన్  ఒలింపిక్  అసోసియేషన్  అధ్యక్షురాలిని కలిసి రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా విజ్ఞప్తి చేసింది. మరోవైపు జాతీయ, అంతర్జాతీయ వేదికలపై విజేతలుగా నిలిచిన క్రీడాకారులకు భారీ నగదు బహుమతులు అందిస్తూ ప్రభుత్వం వారిని ప్రోత్సహిస్తోంది.

నిరుడు సందడి చేసిన మెస్సీ

అంతర్జాతీయ టోర్నీలతో పాటు దేశీయంగా ప్రతిభను గుర్తించేందుకు జాతీయ స్థాయి చాంపియన్‌‌‌‌షిప్‌‌‌‌లకు కూడా తెలంగాణ అత్యధిక ప్రాధాన్యం ఇస్తోంది.  కరాటే, రోయింగ్, బాక్సింగ్, వుషు తదితర విభాగాల్లో జాతీయ స్థాయి టోర్నీలకు గచ్చిబౌలి, ఎల్బీ స్టేడియాలు ప్రధాన వేదికగా నిలిచాయి. నిరుడు నవంబర్‌‌‌‌లో ఫుట్‌‌‌‌బాల్, బ్యాడ్మింటన్  ఎగ్జిబిషన్ మ్యాచ్‌‌‌‌ల పేరిట ‘తెలంగాణ మీట్స్ నార్త్ ఈస్ట్ ఇండియా’ అనే వినూత్న కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించింది. అన్నింటికీ మించి నిరుడు డిసెంబర్ 13వ తేదీన దిగ్గజ ఫుట్‌‌‌‌బాల్  క్రీడాకారుడు మెస్సీ పాల్గొన్న ‘ది గోట్ టూర్’ రాష్ట్ర క్రీడా చరిత్రలోనే  మైలురాయిగా నిలిచింది. 

జాతీయ, అంతర్జాతీయ పెట్టుబడిదారులను, క్రీడా నిపుణులను ఒకే వేదికపైకి తీసుకువచ్చేలా ప్రతిష్టాత్మక స్పోర్ట్స్  కాంక్లేవ్‌‌‌‌ను సైతం ప్రభుత్వం అంగరంగ వైభవంగా నిర్వహించింది. జాతీయ పారా స్విమ్మింగ్, జూడో, అథ్లెటిక్స్ వంటి ఎన్నో జాతీయ పోటీలకు ఆతిథ్యం ఇవ్వడం ద్వారా రాష్ట్రంలోక్రీడా వాతావరణం పూర్తిగా పండుగలా మారిపోయింది. వరుస క్రీడా సమరాలతో యువతలో సరికొత్త స్ఫూర్తి నింపుతూ, విశ్వవేదికపై మన నగరాన్ని తిరుగులేని గ్లోబల్  స్పోర్ట్స్  హబ్‌‌‌‌గా నిలబెట్టేందుకు బృహత్తర ప్రణాళికలు బాటలు వేస్తున్నాయి. 

గ్రామాల్లో టాలెంట్​ను గుర్తించే పోటీలు: జితేందర్​రెడ్డి

రాష్ట్రాన్ని గ్లోబల్ స్పోర్ట్స్ హబ్‌‌‌‌గా తీర్చిదిద్దే లక్ష్యంతో క్రీడల ప్రోత్సాహకం కింద గతంలో రూ.50 కోట్లుగా ఉన్న బడ్జెట్‌‌‌‌ను ఏకంగా రూ.435 కోట్లకు పెంచాం. గ్రామీణ స్థాయి నుంచి ప్రతిభను వెలికితీసేందుకు ‘సీఎం కప్’ పేరుతో రాష్ట్రవ్యాప్తంగా అట్టహాసంగా పోటీలు నిర్వహిస్తున్నాం. అంతకుముందు 57 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ప్రతిష్టాత్మక సంతోష్  ట్రోఫీ ఫుట్‌‌‌‌బాల్  టోర్నీని హైదరాబాద్‌‌‌‌లో నిర్వహించడం చారిత్రక ఘట్టంగా నిలిచింది. 

మెరుగైన క్రీడా విధానాలను అధ్యయనం చేసేందుకు మన అధికారుల బృందం పారిస్  ఒలింపిక్స్‌‌‌‌తో పాటు సింగపూర్, ఆస్ట్రేలియాలోని క్రీడా విశ్వవిద్యాలయాలను ప్రత్యేకంగా సందర్శించింది. యువతకు అంతర్జాతీయ స్థాయి శిక్షణ అందించేందుకు రాష్ట్రంలో సరికొత్తగా స్పోర్ట్స్  యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. ప్రతిష్టాత్మక ఖేలో ఇండియా క్రీడలను సైతం మన రాష్ట్రానికి కేటాయించాలని కోరుతూ సీఎంతో పాటు రాష్ట్ర క్రీడా శాఖ మంత్రితో కలిసి నేరుగా కేంద్రానికి విన్నవించాం.