- పీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ
బషీర్‌బాగ్, వెలుగు : ఒక్క ఫొటో ప్రభుత్వాల కళ్లు తెరిపిస్తుందని మాజీ ఎంపీ, పీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ అన్నారు. ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా నాంపల్లిలోని తెలుగు వర్సిటీ ఆర్ట్ గ్యాలరీలో హై ఆక్టేన్ సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను ఆయన ప్రారంభించారు. పలువురు ఫొటోగ్రాఫర్స్ తీసిన ఫొటోలను మధుయాష్కీ ఆసక్తిగా చూశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సంతోషం, బాధతో పాటు అన్ని భావోద్వేగాలను ఒక్క ఫొటో తెలియజేస్తుందన్నారు. జనానికి నిజాలను చూపించేది ఫొటోలేనన్నారు. ఫొటోగ్రఫీపై ఆసక్తి ఉన్న వారికి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ నిర్వహించడంతో పాటు ఫొటోగ్రాఫర్లకు సరైన ప్రోత్సాహం అందించాలన్నారు.కార్యక్రమంలో హై ఆక్టేన్ సంస్థ అధ్యక్షుడు అనిల్ తదితరులు పాల్గొన్నారు.
