- కామన్ గ్రేడ్ అయితేనే ఓకే అంటున్న మిల్లర్లు
- హైబ్రిడ్ సీడ్స్ సాగుతోనే ఈ లొల్లి
- గ్రేడ్ మార్పుతో క్వింటాల్‌కు రూ. 20 నష్టం, ఎకరాకు రూ. 500
యాదాద్రి, వెలుగు:వడ్ల కొనుగోలులో ‘గ్రేడ్’ పంచాది నడుస్తోంది. కొనుగోలు సెంటర్లలో ఏఈవోలు ‘ఏ గ్రేడ్’ గుర్తిస్తే మిల్లుకు వచ్చిన తర్వాత ‘కామన్ గ్రేడ్’కు ఓకే అంటేనే దించుకుంటామని మిల్లర్లు మొండికేస్తున్నారు. రెగ్యులర్ విత్తనాలు కాకుండా హైబ్రిడ్ విత్తనాలతో సాగు కారణంగానే ఈ పరిస్థితి తలెత్తిందని సివిల్ సప్లయ్ ఆఫీసర్లు అంటున్నారు. ఈ పరిణామాల మధ్యలో రైతులు నష్టపోతున్నారు.
సెంటర్‌కు ‘సన్న గింజ’ రాలే..
యాదాద్రి జిల్లాలో ఈ సీజన్లో 3.15 లక్షల ఎకరాల్లో వరి పండించారు. ఇందులో 3.11 లక్షల ఎకరాల్లో దొడ్డు రకం, 4 వేల ఎకరాల్లో సన్నరకం వేశారు. మొత్తంగా 6.92 లక్షల టన్నుల దిగుబడి వస్తుందని, ఇందులో 4.50 లక్షల టన్నుల వడ్లు కొనుగోలుకు అవసరమైన స్థాయిలో సెంటర్లు ప్రారంభించారు. 4 వేల ఎకరాల్లో సన్నరకం సాగు చేయగా లక్ష క్వింటాళ్లు దిగుబడి రావాల్సి ఉంది. సన్న రకాలు కొనుగోలు సెంటర్లకు రాకపోవడంతో ఎక్కడా గింజ కూడా కొనుగోలు కాలేదు.
హైబ్రిడ్ సీడ్‌తో సాగు..
కొందరు రైతులు హైబ్రీడ్ విత్తనాలతో సాగు చేయడంతోనే ఈపరిస్థితి తలెత్తిందని ఆఫీసర్లు చెబుతున్నారు. సంప్రదాయకమైన 1010 రకం కాకుండా, దిగుబడి ఎక్కువగా వస్తుందన్న కారణంగా ఈసారి కొందరు రైతుల హైబ్రీడ్ విత్తనాలతో సాగు చేశారని చెబుతున్నారు. సాధారణంగా యాసంగిలో 1010 రకం సాగు చేస్తే ఎకరాకు 25 నుంచి 28 క్వింటాళ్ల వడ్లు దిగుబడి రావడంతో పాటు గింజలో పాలు నిండుగా ఉండడం వల్ల గింజ పొడుగుగా ఉంటోంది. ఈసారి సాగు చేసిన కొన్ని రకాల హైబ్రీడ్ విత్తనాలతో 30 నుంచి 35 క్వింటాళ్ల దిగుబడి వస్తోంది.
అయితే వీటి గింజల్లో పాలశాతం సరిగా లేక పొట్టిగా ఉండడంతో పాటు తాలు శాతం కూడా ఉంటోంది. రూల్స్ ప్రకారం పద గింజల్లో 6 కంటే ఎక్కువగా పొట్టిగా ఉంటే కామన్ గ్రేడ్గా గుర్తించాల్సి ఉంటుంది. గింజలో తాలు 3 శాతం తక్కువగా ఉంటే ఏ గ్రేడ్గా, అంతకంటే ఎక్కువగా ఉంటే కామన్‌గా గుర్తించాల్సి ఉంటుంది. దోమకాటు కారణంగా గింజపై మచ్చ కూడా పడుతోంది. ఈ కారణాలతో వడ్లను బాయిల్డ్ చేస్తే గింజ మాడిపోతుందని మిల్లర్లు చెబుతున్నారు. వీటిని సీఎంఆర్ కోసం ఎఫ్‌సీఐకి పంపిస్తే రిజెక్ట్ చేస్తున్నారని చెబుతున్నారు. ఇవేవీ తెలియని కొందరు రైతులకు ఫర్టిలైజర్ షాపుల వాళ్లు దిగుబడి ఎక్కువగా వస్తోందని చెప్పడంతో హైబ్రిడ్ సీడ్స్ తీసుకుంటున్నారు.
‘గ్రేడ్’ పంచాది.. రైతుకు నష్టం
జిల్లాలో ఇప్పటివరకూ 3003 మంది రైతుల వద్ద 29,520 టన్నుల వడ్లు కొనుగోలు చేశారు. ఇందులో ఏ గ్రేడ్ 15,513 టన్నులు, కామన్ గ్రేడ్ 14,007 టన్నుల వడ్లు కొనుగోలు చేసినట్టుగా సివిల్ సప్లయ్ డిపార్ట్మెంట్ చెబుతోంది. కాగా, వడ్ల కొనుగోలులో ‘గ్రేడ్’ పంచాది కొనసాగుతోంది. ఏఈవోలు ఏ గ్రేడ్గా గుర్తించినా, మిలర్లు మాత్రం అంగీకరించడం లేదు. కామన్‌గా గుర్తిస్తేనే తీసుకుంటామని మొండి కేస్తున్నారు.
వడ్ల కొనుగోలుకు సంబంధించి ఏ ఒక్క రైతుకు కూడా మిల్లర్ ఒక్క రూపాయి కూడా చెల్లించడు. కానీ సీఎంఆర్ ఇచ్చే సమయంలో రిజెక్ట్ చేస్తోందని మిల్లర్లు చెబుతున్నారు. వాస్తవానికి ఏ గ్రేడ్‌కు రూ. 2,389, కామన్ గ్రేడ్‌కు రూ. 2,369గా కేంద్రం ప్రకటించింది. ఏ గ్రేడ్‌కు, కామన్ గ్రేడ్‌కు క్వింటాల్‌కు రూ. 20 మాత్రమే తేడా కన్పించినా, ఎకరాకు రూ. 500 చొప్పున పది ఎకరాలకు రూ. 5 వేలు రైతు నష్టపోతున్నాడు.
ఏఈవోలకు వర్క్‌లోడ్..
జిల్లాలోని ఏఈవోలు తొంబై మంది కంటే తక్కువే ఉన్నారు. వీరిలో మహిళలే ఎక్కువ మంది ఉన్నారు. అయితే ఏర్పాటు చేసిన 332 సెంటర్లలో వీరే గ్రేడ్ నిర్ణయించాల్సి ఉంటోంది. ఈ లెక్కన ఒక్కో ఏఈవోకు 5సెంటర్లు కేటాయించారు. రోజూ ఈ ఐదు సెంటర్లలోని కుప్పల్లోని వడ్లను పరిశీలించి గ్రేడ్ నిర్ణయించడం ఇబ్బంది అవుతోందని చెబుతున్నారు. పైగా తాము ఏ గ్రేడ్గా గుర్తించిన వడ్లను కామన్ గ్రేడ్గా గుర్తించాలని ఒత్తిడి చేయడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కావాలని మిల్లర్లు ఈ విధంగా కొర్రీలు పెడుతున్నారని ఆరోపిస్తున్నారు.
