V6 News

సర్ ను తేలిగ్గా తీసుకుంటే ప్రజాస్వామ్యానికే ప్రమాదం : రాజకీయ విశ్లేషకుడు డాక్టర్ పరకాల ప్రభాకర్

సర్ ను తేలిగ్గా తీసుకుంటే  ప్రజాస్వామ్యానికే ప్రమాదం : రాజకీయ విశ్లేషకుడు డాక్టర్ పరకాల ప్రభాకర్
  •      ‘తెలంగాణ ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ ’ పై అవగాహన సదస్సు
  •     పాల్గొన్న పరకాల ప్రభాకర్, రాంచంద్రమూర్తి

హైదరాబాద్ సిటీ, వెలుగు: ‘సర్‌‌’‌‌ ను తేలికగా తీసుకుంటే దేశ ప్రజాస్వామ్యానికే ప్రమాదం ఏర్పడే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకుడు డాక్టర్ పరకాల ప్రభాకర్ అన్నారు. హైదరాబాద్ బాగ్ లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రాజ్యాంగ పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన ‘తెలంగాణ ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ’పై అవగాహన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.ఈ కార్యక్రమానికి సీనియర్ సంపాదకులు రామచంద్ర మూర్తి, సీనియర్ హైకోర్టు అడ్వొకేట్ విద్యాసాగర్ హాజరయ్యారు. 

పరకాల ప్రభాకర్ మాట్లాడుతూ రాజ్యాంగం ప్రజలను రక్షిస్తుందని భావించిన పరిస్థితి నుంచి, ఇప్పుడు రాజ్యాంగాన్ని రక్షించుకునేందుకు వేదికలు ఏర్పాటు చేసుకోవాల్సిన పరిస్థితి దేశంలో ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు.  దేశంలో ప్రస్తుతం అసాధారణ పరిస్థితులు నెలకొన్నాయన్నారు. ఓటర్ల జాబితా ప్రక్షాళన పేరుతో విదేశీయులు, చొరబాటుదారుల అంశాన్ని ముందుకు తెస్తున్నారన్నారు. 

ఆ పేరుతో బిహార్, వెస్ట్ బెంగాల్, తమిళనాడు రాష్ట్రాల్లో జరిగిన పరిణామాలు ఆందోళన కలిగిస్తున్నాయన్నారు. ప్రతి ఏడాది సాధారణంగా జరిగే స్పెషల్ సమ్మరీ రివిజన్ ఉన్నప్పటికీ, 2025లో కేంద్ర ఎన్నికల కమిషన్ ప్రత్యేకంగా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ సర్ ను ప్రవేశపెట్టిందన్నారు. ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారో, దాని వెనుక కారణాలేమిటో స్పష్టత లేదని, ఆర్టీఐ ద్వారా ప్రశ్నించినప్పటికీ సమాధానం రాలేదన్నారు. బిహార్‌‌లో ఈ ప్రక్రియలో భాగంగా 63 లక్షల ఓటర్లను తొలగించారని ప్రకటించారు. కానీ, ఆ వివరాలు వెల్లడించడంలో ఎన్నికల కమిషన్ విఫలమైందన్నారు. 

ఒకే ఇంట్లో వందల సంఖ్యలో ఓటర్లు నమోదైనట్లు, కొన్ని నియోజకవర్గాల్లో వేల సంఖ్యలో నకిలీ ఓట్లు ఉన్నట్లు వెల్లడైందన్నారు. తమిళనాడులో కూడా లక్షలాది ఓట్లు తొలగించారన్నారు. సర్ ను తేలికగా తీసుకుంటే దేశ ప్రజాస్వామ్యానికి ప్రమాదం ఏర్పడే అవకాశం ఉందన్నారు. ఇతరుల ఓటు తొలగింపును చిన్న విషయంగా తీసుకుంటే, రేపు మన ఓటు కూడా ఉండకపోవచ్చు అని హెచ్చరించారు. హైకోర్టు అడ్వొకేట్ విద్యాసాగర్ మాట్లాడుతూ వెస్ట్ బెంగాల్‌‌లో ప్రత్యేక సమగ్ర సవరణ కారణంగా లక్షలాది మంది ఓటు హక్కు కోల్పోయారన్నారు. ఇదే ప్రభావం తెలంగాణపై కూడా పడే అవకాశముందన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు ప్రజాస్వామ్యవాదులు అప్రమత్తంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు.