బషీర్‌బాగ్, వెలుగు: ఇటీవల కుక్కల రక్తంతో వ్యాపారం జరుగుతుందంటూ మీడియాలో వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవమని పెట్స్ కేర్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వ్యవస్థాపకుడు డాక్టర్ కె.వెంకట్ యాదవ్ స్పష్టం చేశారు. తమ హాస్పిటల్ అభివృద్ధిని ఓర్వలేక కొందరు కావాలనే కుట్రపూరితంగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్ బషీర్‌బాగ్ ప్రెస్ క్లబ్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
తమ హాస్పిటల్ స్థాపించి దాదాపు 15 ఏండ్లు కావస్తుందని, ఇప్పటివరకు లక్షల సంఖ్యలో కుక్కలకు చికిత్సలు, సర్జరీలు చేసినట్లు తెలిపారు. తమ హాస్పిటల్లో గతంలో పనిచేసిన కొందరు వ్యక్తులు హాస్పిటల్‌ను అప్రతిష్టపాలు చేయాలనే ఉద్దేశంతో వీధి కుక్కల నుంచి రక్తం సేకరించి విక్రయిస్తున్నట్లు జంతు హక్కుల ఉద్యమకర్త మేనకా గాంధీకి ఫిర్యాదు చేశారని చెప్పారు. కుక్కల రక్తాన్ని ఇతర జంతువులకు ఎక్కించడం సాధ్యం కాదన్నారు.
