
- స్వదేశీ ఉత్పత్తుల విప్లవానికి నడుం బిగించాలి: ప్రధాని మోదీ
- భారతీయులు తయారు చేసిన వస్తువులనే కొనాలి
- ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత రుద్ర రూపాన్ని ప్రపంచం చూసింది
- పాతాళంలో ఉన్నా టెర్రరిస్టులను వదిలిపెట్టం
- సిందూర్ విజయం కొందరికి మింగుడుపడటం లేదని ఫైర్
- పాక్, ఉగ్రవాదుల బాధను చూసి కన్నీళ్లు పెట్టుకుంటున్నారని కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీపై విమర్శలు
- వారణాసి ర్యాలీలో ప్రధాని ప్రసంగం
వారణాసి: ప్రపంచంలోనే భారత్ మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగేందుకు పరుగులు పెడ్తున్నదని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం ఆర్థిక అనిశ్చితి నెలకొన్న నేపథ్యంలో దేశ ఆర్థిక ప్రయోజనాలపై మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని, ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటున్నదని చెప్పారు. శనివారం యూపీలోని వారణాసిలో నిర్వహించిన ర్యాలీలో ప్రధాని మోదీ ప్రసంగించారు. ‘‘ప్రపంచవ్యాప్తంగా అనిశ్చిత వాతావరణం నెలకొన్నది. ప్రతి దేశం తన సొంత ప్రయోజనాలపై దృష్టిసారిస్తున్నది. ప్రపంచంలోనే భారత్ మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించబోతున్నది” అని వ్యాఖ్యానించారు. భారత్ ఆర్థిక వ్యవస్థను ‘డెడ్ ఎకానమీ’ అంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల చేసిన విమర్శల నేపథ్యంలో మోదీ కామెంట్స్ ప్రాధాన్యం సంతరించుకున్నాయి.రాజకీయ పార్టీలన్నీ విభేదాలను పక్కనబెట్టి ‘స్వదేశీ’ ఉత్పత్తుల విప్లవానికి నడుంబిగించాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. భారత్‌ను ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా చూడా లనుకునేవారు భారతీయులు తయారుచేసిన వస్తువులను మాత్ర మే కొనుగోలు చేయాలన్నారు. ‘‘మనమందరం కలిసి ఇండియా మేడ్ వస్తువులనే కొందాం. వోకల్ఫర్ లోకల్‌కు మద్దతుగా నిలుద్దాం” అని అన్నారు.
భారత్‌తో పెట్టుకుంటే ఎక్కడున్నా వదిలిపెట్టం
అన్యాయం ఎదురైతే మహదేవ్ తన రుద్రరూపం ప్రదర్శిస్తాడని, ఆపరేషన్ సిందూర్ సమయంలో ఆ రూపాన్ని ప్రపంచం చూసిందని మోదీ చెప్పారు. భారత్‌తో పెట్టుకుంటే టెర్రరిస్టులు పాతాళలోకంలో ఉన్నా వదిలిపెట్టబోమని నిరూపించామన్నారు. ఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్తాన్‌లోని ఉగ్రవాద స్థావరాలను భారతదేశం నాశనం చేయడా న్ని కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు జీర్ణించుకోలేకపోతున్నాయని విమర్శించారు. ‘‘మన దెబ్బకు పాకిస్తాన్ బాధపడుతుంటే కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీ తట్టుకోలేకపోతున్నాయి. పాక్ పరిస్థితిని చూసి కన్నీళ్లు పెట్టు కుంటున్నాయి. మన సైన్యం పరాక్రమాన్ని కాంగ్రెస్ నిరంతరం అవమానిస్తున్నది. ఆపరేషన్ సిందూర్‌ను ‘తమాషా’ అంటున్నది” అని ఫైర్ అయ్యారు. ‘‘ఈ ప్రత్యేకమైన రోజునే పహల్గాం టెర్రరిస్టులను ఎందుకు చంపారని ఆ పార్టీ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఏదైనా చర్య తీసుకునే ముందు నేను వారిని పిలిచి అడగాలా? ఇంగితజ్ఞానం ఉంటే దీనికి సమాధానం చెప్పాలి. ఉగ్రవాదులను చంపడానికి మనం వేచి ఉండాలా? వారికి పారిపోయే అవకాశం ఇవ్వాలా?” అని ప్రశ్నించారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఉగ్రవాదులకు క్లీన్ చిట్ ఇచ్చిందని మోదీ ఆరోపించారు.