కరెంట్ షట్​డౌన్​కు బీఆర్ఎస్ కుట్ర: పొంగులేటి

కరెంట్ షట్​డౌన్​కు బీఆర్ఎస్ కుట్ర: పొంగులేటి
  • అధికారులతో సమీక్షించి సరిచేసినం: పొంగులేటి
  • కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఇబ్బంది పడేలా ప్లాన్
  • మేం పరిపాలకులం కాదు.. ప్రజా సేవకులం
  • భూములు కబ్జా చేసినోళ్లను వదిలిపెట్టమన్న మంత్రి

ఖమ్మం, వెలుగు: కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రాష్ట్రం చీకట్లోకి వెళ్లేలా గత ప్రభుత్వం కుట్ర చేసిందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ కుట్రలను సీఎం రేవంత్ రెడ్డి తిప్పి కొట్టారని, అధికారులతో సమీక్షించి ఒక్క నిమిషం కూడా కరెంట్ పోకుండా చర్యలు తీసుకున్నారని తెలిపారు. మంగళవారం ఖమ్మంలోని ఎస్ఆర్ కన్వెన్షన్​లో ఆయన మీడియాతో మాట్లాడారు. ముందు మెరుపులు, వెనక డొల్లతనమే కేసీఆర్ పాలన అని ఎద్దేవా చేశారు. ధనిక రాష్ట్రం అంటూ ప్రగల్భాలు పలుకుతూనే అప్పుల కుప్పగా మార్చారని విమర్శించారు. ‘‘ఏదో చిన్న చిన్న అప్పులు సహజం అనుకున్నాం. కాంగ్రెస్ చార్జ్ తీసుకున్నాక తెలిసింది.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎలా ఉందో.. తొమ్మిదిన్నరేండ్లలో రూ.6.71 లక్షల కోట్ల అప్పులు చేశారు. చేసిన అప్పులకు.. పెంచిన సంపదకు సంబంధమే లేదు. ఉమ్మడి రాష్ట్ర సీఎంలు నివాసం ఉన్న భవనం సరిపోదని, అప్పు చేసి ప్యాలెస్ కట్టుకున్నడు. పేదల బాధలు పట్టించుకోకుండా అప్పులు చేసి మరీ సెక్రటేరియెట్ కట్టిన్రు. నేను.. నా.. నాది.. తప్ప కేసీఆర్ కుటుంబానికి ఇంకేమీ పట్టలేదు”అని పొంగులేటి విమర్శించారు. చారిత్రక నేపథ్యం ఉన్న ఖమ్మం కలెక్టర్ ఆఫీస్ కాదని.. కొత్తది కట్టారని, కాళేశ్వరం వెనుక తెలంగాణ ప్రజలు విస్తుపోయే నిజాలు దాగున్నాయని తెలిపారు. 

కాళేశ్వరంతో ఉపయోగం లేదు

కాళేశ్వరంతో ఫ్యూచర్ ఉన్నట్లు కనిపించడం లేదని మంత్రి పొంగులేటి అన్నారు. మొక్కుబడిగా నిర్మించారని, చిత్తశుద్ధితో కడితే పంపు హౌస్ ఎందుకు మునిగిందని ప్రశ్నించారు. అంత కిందికి ఎందుకు కట్టారని ప్రశ్నిస్తే అధికారుల వద్ద సమాధానం లేదన్నారు. ఇంత అవినీతికి పాల్పడి కూడా.. అసెంబ్లీలో గొడవకు దిగారని మండిపడ్డారు. ‘‘ఆర్థిక, ఇరిగేషన్ శాఖలను వెలగబెట్టిన హరీశ్ రావు ఇష్టమొచ్చినట్లు మాట్లాడిండు. మేం పరిపాలకులం కాదు.. ప్రజా సేవకులం. ఆర్థిక ఇబ్బందులు ఉన్న మాట వాస్తవమే.. అయినా, ఆరు గ్యారంటీలు అమలు చేస్తాం. పేదోడి గుమ్మాన్ని ప్రతి స్కీమ్ ముద్దాడాలనేదే మా లక్ష్యం’’ అని పొంగులేటి అన్నారు.

అర్హులైన జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలిస్తాం

రాష్ట్రంలో అర్హులైన జర్నలిస్టులందరికీ ఇండ్ల స్థలాలు ఇస్తామని మంత్రి పొంగులేటి చెప్పారు. మీడియా మిత్రుల సమస్యలన్నీ పరిష్కరిస్తామన్నారు. కాంగ్రెస్ గెలుపులో మీడియా భాగస్వామ్యం కూడా ఉందని గుర్తుచేశారు. ‘‘సఖ్యతగా పనిచేస్తే గెలిచే అవకాశం ఉందని మీరే చెప్పారు. మేం కలిసి పని చేసి గెలిచాం. ప్రభుత్వ స్థలాలు కబ్జా చేసిన వారిపై చర్యలు తీసుకుంటాం. అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్న భూములను వెనక్కు తీసుకుంటం”అని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ లీడర్లు రాయల నాగేశ్వర రావు, కోట రాంబాబు పాల్గొన్నారు.