గాంధీ భవన్లో పొన్నం అనుచరుల రచ్చ రచ్చ...

గాంధీ భవన్లో పొన్నం అనుచరుల రచ్చ రచ్చ...
  • గాంధీభవన్​కు తరలివచ్చిన వందలాది కార్యకర్తలు
  • పొన్నం ప్రభాకర్​కు అనుకూలంగా నినాదాలు

హైదరాబాద్, వెలుగు: గాంధీభవన్​లో కాంగ్రెస్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ అనుచరులు రచ్చ రచ్చ చేశారు. ఇటీవల ప్రకటించిన ప్రదేశ్ ఎన్నికల కమిటీలో ఆయనకు చోటు కల్పించకపోవడంతో ఆదివారం పెద్దఎత్తున అనుచరులు ఆగ్రహంతో గాంధీ భవన్​కు చేరుకుని నిరసన తెలిపారు. ‘చలో గాంధీభవన్ ’ పేరిట కరీంనగర్ జిల్లాలోని 7 నియోజకవర్గాలకు చెందిన వందలాది మంది కార్యకర్తలు 150కి పైగా వాహనాల్లో గాంధీభవన్ చేరుకున్నారు. పొన్నం ప్రభాకర్​కు అనుకూలంగా నినాదాలు చేశారు. పార్టీ ఆఫీస్​కు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేరుకోగానే పెద్దఎత్తున నిరసన తెలిపారు. గద్వాల జిల్లాకు చెందిన బీఆర్ఎస్, బీజేపీ నేతలు, కార్యకర్తలు రేవంత్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న సందర్భంలో పొన్నం అనుచరులు మెట్ల మీదే ఆందోళన చేపట్టారు. పెద్ద సంఖ్యలో కార్యకర్తలు గాంధీభవన్​కు తరలిరావడం.. కారిడార్ చిన్నగా ఉండటంతో కొంత తోపులాట జరిగింది.

మంచి పదవి ఇస్తామంటూ హామీ

కొంత మంది పొన్నం అనుచరులను రాష్ట్ర వ్యవహా రాల ఇన్​చార్జ్ మాణిక్ రావు ఠాక్రే, పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, పార్టీ సీనియర్ నేతలు లోపలికి పిలిపించుకుని మాట్లాడారు. పొన్నం ప్రభాకర్​ను ప్రదేశ్ ఎన్నికల కమిటీలో ఎందుకు చోటు కల్పించలేదని అనుచరులు ప్రశ్నించారు. కావాలనే పక్కన పెడుతున్నారని విమర్శించారు. దీనిపై స్పందించిన సీనియర్ లీడర్లు.. ఆందోళన విరమించాలని సముదాయించారు. పొన్నం ప్రభాకర్​కు పార్టీలో తగిన ప్రాధాన్యం ఉంటుందని, మంచి పొజిషన్ ఇస్తామని హామీ ఇచ్చారు. మున్ముందు వేయబోయే కమిటీల్లోనూ సముచిత స్థానం కల్పిస్తామని భరోసా ఇచ్చారు. దీంతో పొన్నం అనుచరులు శాంతించారు.

కమిటీలో అందుకేనా కోత..

2018 ఎన్నికల టైంలో నియమించిన ఎన్నికల కమి టీలో 46 మందికి చోటిచ్చారు. ఇప్పుడు ఆ సంఖ్య 26కు తగ్గించారు. దీనిపై కూడా పొన్నం అనుచరులకు ఠాక్రే, రేవంత్ వివరణ ఇచ్చినట్టు తెలిసింది. వాస్తవానికి తొలి జాబితాలో 40 నుంచి 45 మంది పేర్లతో లిస్ట్​ను పీసీసీ సిద్ధం చేసినట్టు సమాచారం. అయితే, దాన్ని పరిశీలించిన ఢిల్లీ పెద్దలు.. ఇప్పటిదాకా వివిధ రాష్ట్రాల్లో ఎన్నికల కమిటీల నిబంధనలే ఫాలో కావాలని చెప్పినట్టు తెలిసింది. ఈ అడ్జస్ట్​మెంట్​లోనే పొన్నం పేరును తొలగించినట్టు తెలిసింది.

ఠాక్రే ముందు ఈరవర్తి ఆవేదన

మాజీ ఎమ్మెల్యే ఈరవర్తి అనిల్ కూడా ఠాక్రే ముందు తన ఆవేదన చెప్పుకున్నట్లు తెలిసింది. పార్టీలో ఎప్పటి నుంచో ఉంటున్నా.. సరైన ప్రాధాన్యం ఇవ్వడం లేదని వాపోయినట్టు సమాచారం. తనకు పదవులు రాకుండా ఓ లీడర్​ అడ్డుకుంటున్నారంటూ ఠాక్రేకు ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. ఆరు నెలల కింద తనను ఏఐసీసీ స్పోక్స్​పర్సన్​గా పీసీసీ చీఫ్ రేవంత్ ప్రతిపాదించారని, కావాలనే తనకు ఆ హోదా రాకుండా అడ్డుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎవరు ఆపారో.. ఎందుకు ఆపించారో కూడా ఢిల్లీ పెద్దలు చెప్పారని ఠాక్రేకు వివరించారు.