ఓపెన్ డిగ్రీతో కార్పొరేట్ కొలువు..అంబేద్కర్ వర్సిటీ స్టూడెంట్లకు ‘గోల్డెన్ చాన్స్’

ఓపెన్ డిగ్రీతో కార్పొరేట్ కొలువు..అంబేద్కర్  వర్సిటీ స్టూడెంట్లకు ‘గోల్డెన్ చాన్స్’
  •     టీసీఎస్ అయాన్​తో కలిసి ప్రత్యేక కోర్సు
  •     మార్చి 15 వరకు దరఖాస్తులకు అవకాశం
  •     వీసీ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి వెల్లడి

హైదరాబాద్, వెలుగు: డిగ్రీ పూర్తవ్వగానే ఉద్యోగం కోసం చెప్పులరిగేలా తిరిగే పనిలేకుండా.. చదువుతుండగానే కార్పొరేట్  కొలువు సాధించే బంపర్ ఆఫర్‌‌ను డాక్టర్  బీఆర్  అంబేద్కర్  ఓపెన్  యూనివర్సిటీ తన విద్యార్థుల కోసం తీసుకొచ్చింది. ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ తో జతకట్టిన వర్సిటీ.. విద్యార్థుల కోసం ‘జాబ్  అచీవర్ - బిజినెస్  ఆపరేషన్స్  ఎగ్జిక్యూటివ్’ అనే ప్రత్యేక ప్రోగ్రాంను ప్రారంభించింది. 

శనివారం వర్సిటీ క్యాంపస్‌‌లో వీసీ ప్రొఫెసర్  ఘంటా చక్రపాణి టీసీఎస్ ప్రతినిధులతో కలిసి ఈ కోర్సు పోస్టర్‌‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇది విద్యార్థులకు నిజంగా ‘గోల్డెన్  చాన్స్’ అని, డిగ్రీ పట్టాతో పాటే చేతిలో ఉద్యోగ నియామకపత్రం ఉండేలా ఈ కోర్సును రూపొందించామని తెలిపారు. 

టీసీఎస్‌‌తో అనుసంధానమై ఉన్న దాదాపు 3 వేలకు పైగా కార్పొరేట్  కంపెనీల్లో ఉద్యోగాలు ఇప్పించేలా ఈ శిక్షణ ఉంటుందని వీసీ వివరించారు. ఐటీ, సాఫ్ట్‌‌వేర్  రంగాల్లో సెటిల్  అవ్వాలనుకునే వారికి ఇది వరం లాంటిదన్నారు. బిజినెస్  ఆపరేషన్స్, కస్టమర్  సపోర్ట్, సేల్స్, అడ్మిన్, ప్రాజెక్ట్  మేనేజ్‌‌మెంట్  వంటి విభాగాల్లో విద్యార్థులను ఎక్స్‌‌పర్ట్స్ గా తీర్చిదిద్దుతామని చెప్పారు. 

అంబేద్కర్  ఓపెన్  యూనివర్సిటీలో బీఏ, బీకాం, బీఎస్సీ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థులంతా ఈ కోర్సులో చేరడానికి అర్హులని వెల్లడించారు. ప్రస్తుతం అడ్మిషన్లు జరుగుతున్నాయని, ఆసక్తి ఉన్నవారు మార్చి 15 లోగా నమోదు చేసుకోవాలని సూచించారు. మరిన్ని వివరాలకు www.braou.ac.in వెబ్‌‌సైట్‌‌  చూడాలని లేదా 040-2368 0555, టోల్ ఫ్రీ నంబర్ 1800- 599-0101ను సంప్రదించాలన్నారు. ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్ ఎల్వీకే రెడ్డి, టీసీఎస్ ప్రోగ్రాం డైరెక్టర్ లీనా టిప్రే, ప్లేస్‌‌మెంట్ ఆఫీసర్ వేణుగోపాల్ రెడ్డి పాల్గొన్నారు.