తెలంగాణను ముంచి ఢిల్లీకి పైసలు పంపుతున్నరు.. కాంగ్రెస్‌‌‌‌ ప్రభుత్వంలో కొత్త స్కీమ్‌‌‌‌లు లేవు.. నెలకో స్కామే: హరీశ్‌‌‌‌రావు

తెలంగాణను ముంచి ఢిల్లీకి పైసలు పంపుతున్నరు.. కాంగ్రెస్‌‌‌‌ ప్రభుత్వంలో కొత్త స్కీమ్‌‌‌‌లు లేవు.. నెలకో స్కామే: హరీశ్‌‌‌‌రావు
  • ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తే రేవంత్ రెడ్డి బూతులు మాట్లాడుతున్నడు
  • మున్సిపల్‌‌‌‌ ఎన్నికల్లో కర్రుకాల్చి వాతపెడితేనే వారికి సోయి వస్తది
  • లేకుంటే రైతు బంధు ఎత్తేస్తరు.. తులం బంగారం ఊసే ఎత్తరు 
  • బీజేపీకి ఓటేస్తే మోరీలో వేసినట్టేనని కామెంట్​

జిన్నారం/తూప్రాన్/గజ్వేల్‌‌, వెలుగు: కాంగ్రెస్‌‌ ప్రభుత్వంలో ఒక్క కొత్త స్కీమ్‌‌ కూడా లేదని, నెలకో స్కామ్‌‌ మాత్రం ఉన్నదని మాజీ మంత్రి, బీఆర్‌‌‌‌ఎస్‌‌ ఎమ్మెల్యే హరీశ్‌‌రావు పేర్కొన్నారు. తెలంగాణను ముంచి ఢిల్లీ వాళ్లకు  పన్నులు కట్టుడే తప్ప రేవంత్‌‌రెడ్డితో ఇంకేమన్నా అయిందా? అని ఎద్దేవా చేశారు. శనివారం ఉమ్మడి మెదక్‌‌ జిల్లాలోని జిన్నారం, గడ్డపోతారం, గుమ్మడిదల, తూప్రాన్, గజ్వేల్‌‌లో నిర్వహించిన మున్సిపల్‌‌ ఎన్నికల ప్రచారంలో హరీశ్‌‌రావు పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో  నెలనెలా స్కామ్‌‌లు చేశారంటూ క్యాలెండర్​ ప్రదర్శించారు.  

మున్సిపల్‌‌ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి కర్రు కాల్చి వాతపెడితేనే సోయి వస్తుందని, లేకుంటే రైతుబంధు ఎగ్గొడతారని.. తులం బంగారం ఊసే ఎత్తరని.. ఏ స్కీమ్‌‌ కూడా ఇవ్వరని అన్నారు. సీఎం రేవంత్‌‌రెడ్డి సమాజంలో ఉన్న ప్రతి వర్గాన్ని ఆగం చేస్తున్నాడని, ఆయనకొచ్చిందల్లా తిట్ల పురాణం తప్ప పని చేసుడు చేతకాదని విమర్శించారు. ‘‘కేసీఆర్‌‌‌‌ ఉన్నప్పుడు కరోనా సమయంలో కూడా రైతు బంధు కొట్టిండు.. కేసీఆర్‌‌‌‌ కిట్‌‌ ఇచ్చిండు.. ఆడబిడ్డలు పెండ్లి చేసుకుంటే కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ కింద లక్ష సాయం అందించిండు.. వెయ్యి గురుకులాలు పెట్టి విద్యార్థులకు చదువు చెప్పిండు.. ప్రతి పని కేసీఆర్‌‌‌‌ చేసిండు. మరో రెండేండ్లలో మళ్లీ కేసీఆర్ ముఖ్యమంత్రి అయితడు.. మన అభివృద్ధి ఆగదు” అని పేర్కొన్నారు.  

తాము కల్యాణ లక్ష్మి అంటే రేవంత్‌‌ తులం బంగారం అన్నాడని, ఇప్పుడు బంగారం ధర పెరిగిపోయిందని అన్నారు. ‘‘కాంగ్రెస్‌‌ వచ్చాకే భూముల ధరలు పాతాళానికి పడిపోయినయ్.. గొర్రె పిల్లలు వస్తున్నాయా?  చేప పిల్లలు వస్తున్నాయా? దళిత బంధు వస్తున్నదా? బతుకమ్మ చీరలు వస్తున్నాయా?” అని ఓటర్లను ప్రశ్నించారు. ఉన్నవి రావడం లేదని.. కొత్తవి రేవంత్‌‌ ఇస్తలేడని అన్నారు. గుమ్మడిదలకు డంప్‌‌ యార్డు రావొద్దన్నా.. అభివృద్ధి  కావాలన్నా బీఆర్‌‌‌‌ఎస్‌‌ అభ్యర్థులను  గెలిపించాలని ఓటర్లను విజ్ఞప్తి చేశారు.

ఆధిపత్యం కావాల్నా? అభివృద్ధి కావాల్నా?

బీఆర్‌‌‌‌ఎస్‌‌ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు తూప్రాన్ మున్సిపాలిటీని అన్ని రకాలుగా అభివృద్ధి చేశామని హరీశ్‌‌రావు తెలిపారు. తమ ప్రభుత్వ హయాంలో ఇంటి పన్నులు 200 ఉంటే..  ఇప్పుడు వెయ్యికి పెంచి పేదోడి నడ్డి విరిచారన్నారు. కేసీఆర్‌‌‌‌ కట్టించిన ప్రభుత్వ ఆసుపత్రిలో ఇప్పుడు కనీసం డాక్టర్లు లేక  రోగులను గాలికి వదిలేశారని ఫైర్‌‌‌‌ అయ్యారు.  ‘‘తూప్రాన్‌‌ను మున్సిపాలిటీ చేసింది..ఆర్డీవో ఆఫీస్ తెచ్చింది.. ఫోర్ లైన్ రోడ్లు వేసి హైవేలా మార్చింది బీఆర్‌‌‌‌ఎస్‌‌ కాదా?” అని ప్రశ్నించారు. గజ్వేల్ నియోజకవర్గానికి కేసీఆర్ రాకముందు తూప్రాన్‌‌కు పిల్లను ఇయ్యాలంటే నీళ్లు మోపిస్తారని భయపడేవాళ్లని..  ఇప్పుడు తూప్రాన్‌‌కే పిల్లనియ్యాలనేలా అభివృద్ధి చేశామన్నారు. 

‘‘పది లక్షల విలువ లేని భూమిని.. కోటి రూపాయలు చేసింది కేసీఆర్. కానీ రేవంత్‌‌రెడ్డి  వచ్చాక భూముల ధరలు పాతాళానికి, బంగారం ధరలు ఆకాశానికి చేరాయి” అని వ్యాఖ్యానించారు. తూప్రాన్‌‌లో కాంగ్రెస్ నాయకులు తమ ఆధిపత్యం కోసం ప్రజలను బలి చేస్తున్నారన్నారు. రెండేండ్లనుంచి తూప్రాన్ అభివృద్ధిని అడ్డుకున్నారని, రోడ్లపై గుంతలు పడితే డాంబర్ వేసే దిక్కు కూడా ఈ ప్రభుత్వానికి లేదని మండిపడ్డారు. 50 పడకల ఆసుపత్రిలో డాక్టర్లు లేక మెదక్, గజ్వేల్‌‌కు పంపుతున్నారని, దవాఖానను పట్టించుకునే సోయి లేదన్నారు.  కాంగ్రెస్ వచ్చాక  బతుకమ్మ చీరలు, కేసీఆర్ కిట్, గొర్రెలు, చేప పిల్లలు, దళిత బంధు.. ఇలా అన్ని బంద్‌‌ పెట్టి  ప్రజలను గోస పెడుతున్నారన్నారు. 

‘‘సద్ది తిన్న రేవు తలవాలి.. మనకు అన్నం పెట్టిన కేసీఆర్‌‌‌‌ను మర్చిపోవద్దు. ప్రతి ఒక్కరు తూప్రాన్ మున్సిపల్‌‌లో ఉన్న 16 వార్డుల్లో కారు గుర్తుకే ఓటేయాలి” అని పిలుపునిచ్చారు. మధ్యల ​బీజేపీ వాళ్లు ఓట్ల కోసం గిర్ర గిర్ర తిరుగుతున్నారని, వాళ్లు తూప్రాన్‌‌కు ఏమైనా చేశారా? అని ప్రశ్నించారు. కమలం పువ్వు గుర్తుకు ఓటేస్తే ఆ ఓటును మోరీలో పారేసినట్టేనని ఎద్దేవా చేశారు.  అసెంబ్లీలో ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తే రేవంత్ రెడ్డికి కండ్లు నెత్తికెక్కి లాగుల తొండలు ఇడుస్తా నని అంటున్నాడని మండిపడ్డారు. 

‘‘ప్రజలకిచ్చిన హామీలను అడిగితే పేగులు మెడలో వేసుకుంటా అంటాడు. తులం బంగారం ఏదీ అంటే గుడ్లు పీకి గోటీలు ఆడుతా అంటాడు. ఇది ఒక సీఎం మాట్లాడే భాషేనా? ఇలాంటి బూతుల సీఎంకు ఈ ఎన్నికల్లో ఓటుతో బుద్ధి చెప్పాలి” అని ఓటర్లకు పిలుపునిచ్చారు. 

కేసీఆర్ హయాంలోనే గజ్వేల్‌‌ దశ మారింది..

గజ్వేల్‌‌ దశ, దిశను మార్చి రాష్ట్రంలోనే నంబర్‌‌ వన్‌‌గా నిలిపిన ఘనత కేసీఆర్‌‌కే దక్కుతుందని  హరీశ్‌‌రావు చెప్పారు. రెండేండ్ల కాంగ్రెస్‌‌ పాలనలో వాస్తవ పరిస్థితులు ప్రజలకు తెలిసొచ్చాయన్నారు.  గజ్వేల్‌‌లో ఒక్క సీసీ రోడ్డు కూడా వేయలేదన్నారు. కేసీఆర్‌‌ కట్టిన బిల్డింగ్‌‌లకు రేవంత్‌‌రెడ్డి రిబ్బన్‌‌ కట్‌‌ చేస్తున్నారని ఎద్దేవా చేశారు. 

బీజేపీ ఎంపీలు గజ్వేల్‌‌కు వచ్చి అబద్ధాలు చెప్పిపోతున్నారని విమర్శించారు. బీజేపీ వాళ్లు పాల ధరలు, జీఎస్టీలు పెంచడం తప్ప పేదలకు చేసిందేమీ లేదన్నారు. ఎవరు ఎన్ని పైసలు ఇచ్చినా, కాళ్లు మొక్కినా బీఆర్‌‌ఎస్‌‌కే ఓటు వేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ యాదవరెడ్డి, గజ్వేల్‌‌ నియోజకవర్గ ఇన్‌‌చార్జి ప్రతాప్‌‌ రెడ్డి పాల్గొన్నారు.