పంచాయతీ ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్

 పంచాయతీ ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్
  • ఉద్యోగులు, పోలీసులు, సైన్యం, 85 ఏండ్లు పైబడిన వృద్ధులు, దివ్యాంగులకు అవకాశం 

హైదరాబాద్, వెలుగు: పంచాయతీ ఎన్నికల్లోనూ ‘పోస్టల్​ బ్యాలెట్’ ద్వారా ఓటు వేసే అవకాశం ఉంది. పోలింగ్ బూత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు వెళ్లలేనివారు, ఉద్యోగులు, పోలీసులు, సైన్యం, రక్షణ దళాల్లో పని చేసేవారు వృద్ధులు, వికలాంగులు దీనిని వినియోగించుకోవచ్చు. ఇందుకోసం సంబంధిత రిటర్నింగ్ అధికారికి ఫారం-12  లేదా ఫారం-12డీ  ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. అధికారులు పరిశీలించి ‘పోస్టల్ బ్యాలెట్ కిట్’ను అందజేస్తారు. 

బ్యాలెట్ పేపర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో అభ్యర్థుల పేర్లు, గుర్తులు ఉంటాయి. నచ్చిన అభ్యర్థి పేరు పక్కన ఉన్న గడిలో ‘టిక్’(రైట్) లేదా ‘క్రాస్’ (X) మార్కును పెన్నుతో పెట్టాలి. బ్యాలెట్ పేపర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై సంతకం చేయకూడదు. చేస్తే ఓటు చెల్లదు. డిక్లరేషన్ ఫారంలో మీ వివరాలు రాసి సంతకం చేయాలి. ఈ సంతకాన్ని తప్పనిసరిగా ఒక గెజిటెడ్ అధికారి చేత అటెస్ట్ చేయించాలి. ఎన్నికల డ్యూటీలో ఉన్నవారు అక్కడే ఏర్పాటు చేసిన డ్రాప్ బాక్స్ లో బ్యాలెట్​ వేయాలి.  సర్వీస్ ఓటర్లు లేదా ఇతరులు పోస్ట్ ద్వారా పంపవచ్చు. దీనికి పోస్టల్ చార్జీలు ఉండవు. కౌంటింగ్ రోజు ఉదయం 8 గంటల లోపు రిటర్నింగ్ అధికారికి పోస్టల్​ బ్యాలెట్​ చేరాల్సి ఉంటుంది.