కొండపైన పూజలు చేస్తూ జారిపడి పూజారి మృతి

కొండపైన పూజలు చేస్తూ జారిపడి పూజారి మృతి

అనంతపురం: అనంతపురం జిల్లా సింగనమల మండలం గంపమల్లయ స్వామి కొండపై అపశృతి చోటు చేసుకుంది. కొండ అంచున పూజలు చేస్తున్న పూజారి ప్రమాదవశాత్తు జారిపడి మృతి చెందాడు. వందల మంది భక్తుల సమక్షంలో గోవింద నామస్మరణలతో కొండ అంచున విగ్రహానికి పూజలు నిర్వహించి హారతి ఇచ్చిన పూజారి పాపయ్య.. కొండ దిగువన ఉన్న గుహలోకి వెళ్లే ప్రయత్నంలో బండరాయి నుంచి జారి బండరాళ్లపై పడుతూ.. కొండ కిందకు పడి అక్కడికక్కడే చనిపోయాడు. కొండపైన స్వామి వారికి పూజలు చేసి మొక్కులు తీర్చుకునేందుకు కొండపైకి వచ్చిన వేలాది మంది భక్తులు కొండ నలువైపుల నుంచి పూజారి పూజలను తమ మొబైల్ ఫోన్లలో చిత్రీకరిస్తుండగా జారి పడిపోతున్న దృశ్యాలు భక్తుల మొబైల్ ఫోన్లలో రికార్డయింది. భక్తి పారవశ్యంలో ఉన్న భక్తులు హఠాత్ ఘటనతో హాహాకారాలు చేశారు. ఏం జరుగుతుందో.. ఏం జరిగిందో చాలా మందికి అర్థం కాలేదు. ఒక్కపెట్టున రోదనలు మొదలుకావడంతో కొండపైన ఏం జరిగిందో అర్థం కాని పరిస్థితి. పూజారి జారిపడిపోయాడన్న విషయం తెలిసి సర్వత్రా దిగ్భ్రాంతికి గురయ్యారు. 
అసలేం జరిగింది.. ఎలా జరిగింది..?
అనంతపురం జిల్లా సింగనమల మండల కేంద్రానికి సమీపంలోని గంపమల్లయ స్వామి కొండపై ఒక గుహలో స్వామి వారు కొలువుదీరి ఉన్నారు. చాలా ఎత్తులో ఉన్న ఈ కొండపైకి వెళ్లి పూజలు చేసి మొక్కులు తీర్చుకోవడం చుట్టుపక్కల ప్రజలకు ఆనవాయితీ. అయితే శ్రావణమాసంలో భక్తుల సంఖ్య భారీగా ఉంటుంది. మామూలు రోజుల్లో తక్కువగా ఉంటుంది. కేవలం శని, ఆది, సోమ వారాల్లో మాత్రమే భక్తులు అరుదుగా వెళ్లి పూజలు చేస్తుంటారు. అయితే భక్తులు ఎవరు వచ్చినా పూజారి పాపయ్య మాత్రమే కొండపైకి వెళ్లి పూజలు చేసి వచ్చి హారతి ఇస్తుంటాడు. కొండపైన గుహలోకి సామాన్య భక్తులు వెళ్లలేరు కాబట్టి.. కొండ అంచున మరో విగ్రహానికి మాత్రం పూజలు చేస్తుంటారు. 
శ్రావణమాసం శనివారం భారీగా తరలివచ్చిన భక్తులు
కొండపైన కొలువుదీరిన గంపమల్లయ్యస్వామికి పూజల కోసం శ్రావణమాసంలో మరీ ముఖ్యంగా శని, ఆది, సోమవారాల్లో భక్తులు భారీగా తరలివస్తుంటారు. ఇదేకోవలోనే ఈరోజు శనివారం వేలది భక్తులు కొండపైకి తరలివచ్చారు. వేలాది మంది కొండపైకి తరలిరావడంతో కొండపైన నలువైపులా భక్తుల జనసందోహంతో నిండిపోయింది. గంపమల్లయ్యస్వామి గుహ పైన కొండ అంచున ప్రతిష్టించిన స్వామి మూర్తికి పూజారి పాపయ్య పూజలు నిర్వహించి హారతి ఇచ్చిన అనంతరం దిగువన గుహలోకి ఒక్కడే వెళ్లి పూజాదికాలు చేసి తిరిగి వచ్చి అందరికీ హారతి ఇస్తాడు. ఇదే క్రమంలో కొండ అంచు దిగువన ఉన్న గుహలోకి వెళ్లేందుకు దిగుతుండగా.. వేలాది భక్తులు గోవింద నామస్మరణలు మార్మోగాయి. గంపమల్లయ్య స్వామి గోవిందా అని భక్తపారవశ్యంతో స్మరిస్తుండగా.. పూజారి గంట కొడుతూ కిందకు దిగే నేపధ్యంలో జారిపడి లోయలోపడి మృతి చెందాడు. గోవింద నామస్మరణలు చేస్తున్న భక్తులు ఒక్కసారిగా హాహాకారాలు చేశారు. దిగువన ఉన్న వారు పూజారి వద్దకు వెళ్లిచూడగా.. తీవ్ర రక్తస్రావం కావడంతో అప్పటికే తుదిశ్వాస విడిచినట్లు గుర్తించారు. హఠాత్తుగా ఊహించని ఘటనతో భక్తులు హాహాకారాలు చేశారు. కళ్ల ముందే పూజారి దేవునికి పూజ చేస్తూ జారిపడి చనిపోవడంతో కన్నీరుమున్నీరయ్యారు. పూజారి పాపయ్య కుటుంబీకులే వంశపారంపర్యంగా ఈ స్వామికి ఆస్థాన పూజారులుగా వ్యవహరిస్తున్నారు.