బకాయిల పేరు చెప్పి.. స్త్రీనిధి  లోన్లు ఇస్తలేరు

బకాయిల పేరు చెప్పి.. స్త్రీనిధి  లోన్లు ఇస్తలేరు
  • ఒక్క సంఘం బాకీ పడినా అప్పుల లిస్టులో వీఓ 
  • బకాయిలు తక్కువే అయినా అందని స్త్రీనిధి రుణాలు 
  • టార్గెట్ రూ.3,400 కోట్లు.. ఇచ్చింది రూ.281 కోట్లు 

అడవి దేవులపల్లి మండలంలో  16 వీఓలు ఉన్నాయి. ఈ వీఓల పరిధిలో సంఘాలకు ఈ ఏడాది రూ.2.32 కోట్లు లోన్​గా ఇవ్వాలని టార్గెట్ పెట్టుకున్నారు. ఇప్పటివరకు కేవలం రూ.8.61 లక్షలు మాత్రమే ఇచ్చారు. ఈ మండలంలో 12 వీఓల పరిధిలోని 135 గ్రూపులు  రూ.55.64 లక్షల మేరకు  బకాయి పడ్డాయి. ఈ గ్రూపులు లోన్లు కట్టకపోవడం వల్ల మండలంలో మిగిలిన 429 సంఘాలు సఫర్ అవుతున్నాయి. 
అనుమల మండలంలో 41 వీఓలు ఉన్నాయి. వీటి పరిధిలో 1,002 సంఘాలున్నాయి. ఈ ఏడాది మండలంలో రూ.4.16 కోట్లు లోన్లు ఇవ్వాల్సిఉండగా.. ఇప్పటివరకు రూ.22.55 లక్షలు మాత్రమే ఇచ్చారు. ఇంకా రూ.3.94 కోట్లు ఇవ్వాల్సి ఉంది. మండలంలోని ఏడు వీవోల పరిధిలోని 45 గ్రూపులు రూ.12.56 లక్షలు బకాయి పడ్డాయి. బకాయిలు చాలా తక్కువే ఉన్నా.. మండలంలో 957 గ్రూపుల సభ్యులు లోన్లు అందక ఇబ్బందులు పడుతున్నారు.

నల్గొండ, వెలుగు: సెల్ఫ్ హెల్ఫ్ గ్రూపులో ఒక్క మెంబర్ బకాయి ఉన్నా.. ఆ గ్రామంలోని మహిళా సంఘాలకు తిరిగి అప్పు ఇవ్వొద్దన్న రూల్ తో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కొన్ని సంఘాలు బకాయి పడితే మెజారిటీ  విలేజ్ ఆర్గనైజేషన్స్(వీఓ) లకు స్త్రీ నిధి లోన్లు అందడం లేదు. స్త్రీనిధిలో వందల కోట్లు అందుబాటులో ఉన్నా.. సంఘాలకు పంచలేని పరిస్థితి నెలకొంది. ఎలాంటి ష్యూరిటీ లేకుండా మహిళా సంఘాల మీద ఉన్న నమ్మకంతోనే స్త్రీనిధి లోన్లు ఇస్తారు. మహిళా సంఘాలు మొదటి నుంచి 100 పర్సెంట్ రికవరీ సాధించడంతో ఇప్పటిదాకా ఈ కండీషన్ వల్ల ఇబ్బంది కలగలేదు. గతేడాది  కరోనా, ఇతర ఆర్థిక సమస్యల వల్ల కొందరు మహిళలు అనుకున్న సమయానికి బకాయిలు కట్టలేకపోయారు. దీంతో రికవరీ పర్సంటేజీ తగ్గిపోయింది.  కొన్ని సంఘాలు తీసుకున్న లోన్లు తిరిగి చెల్లించకపోవడంతో మిగతా గ్రూపులకు లోన్లు  ఆపేశారు. గ్రామాల్లో ఒకటి, రెండు సంఘాలు బకాయిలు కట్టకపోయినా ఆ గ్రామ సమాఖ్య పరిధిలోని గ్రూపులన్నింటికీ లోన్లు ఇవ్వలేదు. దీనివల్ల ఒక్క రూపాయి బాకీ లేని సంఘాలు కూడా సఫర్ అయ్యాయి. బకాయిలున్న వీఓల పరిధిలో కొత్త రుణాలు ఇవ్వకపోవడం వల్ల చాలా మండలాల్లో రుణ లక్ష్యాన్ని చేరుకోలేకపోతున్నారు. ఐకేపీ స్టాఫ్, స్త్రీనిధి స్టాఫ్ మధ్య మొదటి నుంచి విభేదాలు కొనసాగుతున్నాయి. దీంతో బకాయిలున్న గ్రూపులతో సమావేశాలు పెట్టి రికవరీ చేయించాల్సిన ఐకేపీ స్టాఫ్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. 
పది శాతం కూడా ఇయ్యలే 
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 17,859 విలేజ్ ఆర్గనైజేషన్ల పరిధిలో 44,647 సెల్ఫ్ హెల్ఫ్ గ్రూపులున్నాయి. 2021– 22 ఫైనాన్షియల్ ఇయర్​లో ఈ గ్రూపులకు రూ.3,400 కోట్లు లోన్లుగా ఇవ్వాలని టార్గెట్​గా  పెట్టుకోగా ఇప్పటివరకు కనీసం పది శాతం కూడా ఇవ్వలేదు. ఇందులో ఇప్పటివరకు కేవలం 7,880 వీఓల పరిధిలో 29,136 సంఘాలకు రూ.281 కోట్లు మాత్రమే ఇచ్చారు.  స్టేట్​లో 7,193 వీఓల పరిధిలోని గ్రూపులు రూ. 1,411 కోట్లు బకాయి పడ్డాయి. కొన్ని సంఘాల బకాయిల వల్ల చాలా మహిళాసంఘాలు ఇబ్బంది పడాల్సివస్తోంది. రికవరీ సాకుతో బకాయిలు లేని గ్రూపులకు లోన్లు ఇవ్వకపోవడం కరెక్ట్ కాదని మహిళాసంఘాలు అంటున్నాయి. 

ఒక సంఘం వాళ్లు కట్టలేదని..
ఒక సంఘంవారు కట్టలేదని మాకు ఇవ్వాల్సిన స్త్రీ నిధి లోన్​నిలిపి వేసిండ్రు. ఒక్క సంఘం కోసం అనేకమందికి లోన్ ఇవ్వకుండా నెలల తరబడి ఆపడం సరికాదు. నెల నెలా పొదుపు, అప్పు కడుతున్నప్పటికీ లోన్ ఇవ్వకపోవడంతో ఆర్థికంగా ఇబ్బందులు పడాల్సి వస్తోంది.                                                                               – చందా లక్ష్మమ్మ, మహాలక్ష్మి సంఘం హాలియా