ఇండోర్: కేంద్ర ప్రభుత్వం ప్రజలకు స్వచ్ఛమైన తాగునీళ్లను కూడా అందించలేకపోతున్నదని లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మండిపడ్డారు. కేంద్రం నిర్లక్ష్యం కారణంగానే ఇండోర్‌లో కలుషిత నీళ్లు తాగి అమాయకులు ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదొక్క ఇండోర్‌కే పరిమితం కాదని, ఇలాంటి ఘటనలు దేశవ్యాప్తంగా చాలా సిటీల్లో జరుగుతున్నాయని అన్నారు. కేంద్రం స్మార్ట్ సిటీలు అంటూ గొప్పగా చెప్పిందని, ఇదేనా స్మార్ట్ సిటీ అంటే..? అని ప్రశ్నించారు.
ఇండోర్‌లోని భాగీరథ్‌పురాలో తాగు నీళ్లలో డ్రైనేజీ నీళ్లు కలిసిన ఘటనలో ఇప్పటి వరకు 24 మంది చనిపోయారు. మరికొంత మంది ఆస్పత్రిలో ట్రీట్‌మెంట్ పొందుతున్నారు. ముంబైలోని హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న నలుగురు బాధితులను రాహుల్ గాంధీ శనివారం పరామర్శించారు. అలాగే భాగీరథ్‌పురా వెళ్లి, మృతుల కటుంబసభ్యులను ఓదార్చారు. వాళ్లతో ఇంటరాక్ట్ అయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.
సర్కార్ నిర్లక్ష్యం వల్లే..
కేంద్రం గొప్పగా చెప్పిన ఇండోర్ స్మార్ట్ సిటీలోనే ఈ ఘటన జరిగిందని రాహుల్ పేర్కొన్నారు. ‘‘స్మార్ట్ సిటీలు నిర్మిస్తామని మనకు హామీ ఇచ్చారు. స్మార్ట్ సిటీ అంటే తాగడానికి మంచి నీళ్లు కూడా ఇవ్వకపోవడమేనా? పైగా స్వచ్ఛమైన నీళ్లు సరఫరా చేయాలని కోరితే ప్రజలనే బెదిరిస్తున్నారు. కలుషిత నీళ్లు తాగే ఇండోర్‌లో జనం చనిపోయారు. ఇదీ మన కేంద్ర సర్కార్ అర్బన్ మోడల్.. ఇది ఒక్క ఇండోర్‌కే పరిమితం కాదు.
ఇలాంటి ఘటనలు దేశవ్యాప్తంగా ఉన్న సిటీల్లో జరుగుతున్నాయి. ప్రజలకు స్వచ్ఛమైన గాలి, నీరు అందించడంలో కేంద్రం విఫలమవుతున్నది. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లనే ఇండోర్ ఘటన జరిగింది. దీనికి సర్కార్ బాధ్యత వహించాలి. ఈ రోజు వరకు కూడా ఇక్కడి ప్రజలకు స్వచ్ఛమైన నీళ్లు అందడం లేదు. ప్రతిపక్ష నేతగా ప్రజల సమస్యను లేవనెత్తడం నా బాధ్యత. మీరు దీన్ని రాజకీయం అనుకోండి.. ఇంకేదైనా అనుకోండి” అని రాహుల్ అన్నారు.
