- ఎప్స్టీన్ ఫైల్స్‌తో ఆయనలో గుబులు: రాహుల్ గాంధీ
- అదానీ కేసుతో సభకు రాలేకపోతున్నారని ఫైర్
- ప్రధాని దౌత్య వైఫల్యంతో 140 కోట్ల మంది ప్రజలకు ఇబ్బందులు: ఖర్గే
- ఎల్పీజీ కొరతపై పార్లమెంట్ ఆవరణలో ప్రతిపక్షాల నిరసన
న్యూఢిల్లీ, వెలుగు: దేశ ప్రజలను భయపడవద్దని చెప్పి, ప్రధాని నరేంద్ర మోదీయే భయపడుతున్నారని లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ విమర్శించారు. ఎప్ స్టీన్ ఫైల్స్ కారణంగా ఆయన ఆందోళన చెందుతున్నారని, అమెరికాలో అదానీ కేసు కారణంగా సభలోకి రాలేక జంకుతున్నారని ఎద్దేవా చేశారు. దేశంలో ఎల్పీజీ కొరతపై గురువారం సమావేశాల ప్రారంభానికి ముందు మకర ద్వారం ఎదుట ఇండియా కూటమిలోని ప్రతిపక్షాల ఎంపీలు వినూత్నంగా నిరసన తెలిపారు. రాహుల్, రాజ్యసభ ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే, ప్రియాంక గాంధీ, కేసీ వేణుగోపాల్, డీఎంకే, టీఎంసీ, ఎస్పీ సహా ప్రతిపక్ష ఎంపీలు పాల్గొన్నారు. ఇటుకలతో పొయ్యి పెట్టి, వంట స్టవ్‌తో కూర్చుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పలువురు ఎంపీలు సిలిండర్ బొమ్మలతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ‘సంసద్ మే నరేందర్ గాయబ్– దేశ్ మే సిలిండర్ గాయబ్’, ‘నామ్ నరేందర్–కామ్ సరెండర్’, ‘మోదీ జావ్–సిలిండర్ లేకే ఆవ్’, ‘బీజేపీ–ఎల్పీజీ’ అంటూ నినాదాలు చేశారు. సభ వాయిదా పడిన తర్వాత సస్పెండ్ అయిన ఎంపీలతో కలిసి మకర ద్వారం మెట్లపై రాహుల్ బైఠాయించారు. ఈ సందర్భంగా ఇండెక్షన్ స్టౌ (కరెంట్ పొయ్యి) పై తయారు చేసి తెచ్చిన టీని ఎంపీలతో కలిసి తాగారు.
ప్రధాని ఎన్నికల పర్యటనలో మునిగిపోయారు
దేశం ప్రస్తుతం ఎల్పీజీ, ఇతర సమస్యలతో తీవ్ర సంక్షోభంలో ఉంటే.. ప్రధాని మోదీ ఎన్నికల పర్యటనలో మునిగిపోయారని ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే ఎక్స్ వేదికగా విమర్శించారు. కేంద్రంలోని ఎన్డీఏ సర్కారు దౌత్య వైఫల్యం కారణంగా... దేశంలోని 140 కోట్ల మంది బాధపడుతున్నారని ఆయన మండిపడ్డారు. ‘నరేంద్ర మోదీ జీ... బహుత్ హుయే ‘మన్ కీ బాత్’– జరా సంసద్ మే ఆ కర్ కరియే ముద్దే కీ బాత్’ (మన్ కీ బాత్ చాలు, పార్లమెంటుకు వచ్చి సమస్యలపై మాట్లాడండి) అని ఖర్గే చురకలంటించారు.
