అనర్హత వేటు పడినా ..జైల్లో వేసినా..కొట్టినా వెనకడుగు వేయను : రాహుల్

అనర్హత వేటు పడినా ..జైల్లో వేసినా..కొట్టినా  వెనకడుగు వేయను : రాహుల్

అదానీ షెల్ కంపెనీల్లో రూ. 20 వేల కోట్లు పెట్టుబడులు ఎవరు పెట్టారని కాంగ్రెస్ మాజీ ఎంపీ రాహుల్ గాంధీ ప్రశ్నించారు. అదానీ షెల్ కంపెనీల్లో ఎవరుపెట్టుబడులు పెట్టారో ప్రధాని మోడీ చెప్పాలని డిమాండ్ చేశారు. చైనీయులు అదానీ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టారని ఆరోపించారు. మోడీ గుజరాత్ సీఎంగా ఉన్నప్పటి నుంచే అదానీతో సంబంధాలున్నాయని వెల్లడించారు. నిబంధనలను ఉల్లంఘించి అదానీకి ఎయిర్ పోర్టుల నిర్మాణ బాధ్యతలను కట్టబెట్టారని ఆరోపించారు. 

మాట్లాడే అవకాశం ఇవ్వలేదు..

లండన్ తన ప్రసంగంపై కేంద్ర మంత్రులు అబద్దాలు ప్రచారం చేశారని రాహుల్ గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు.  పార్లమెంట్ లోనూ అబద్దాలు మాట్లాడారని చెప్పారు. మంత్రుల ఆరోపణలపై సమాధానం చెప్పేందుకు అవకాశం ఇవ్వాలని స్పీకర్ ను కోరితే..స్పీకర్ నవ్వి మాట్లాడే అవకాశం రాదని తనతో  చెప్పినట్లు వెల్లడించారు. అదానీ వ్యవహారంలో పార్లమెంట్ కు సాక్ష్యాలు సమర్పించానన్నారు. లోక్ సభలో కావాలనే తన ప్రసంగాన్ని తొలగించారని చెప్పారు.

ప్రశ్నించడం మానను

దేశంలో ప్రజాస్వామ్యంపై దాడులు జరుగుతున్నాయని రాహుల్ గాంధీ మండిపడ్డారు. తనపై వేటే అందుకు నిదర్శనమని చెప్పారు. తాను దేనికి భయపడనని అన్నారు.  ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రశ్నించడం మాత్రం మానేది లేదని స్పష్టం చేశారు. జైలుకు వెళ్లడానికి కూడా సిద్ధమనేనన్నారు.  అదానీ వ్యవహారాన్ని తాను ప్రశ్నిస్తూనే ఉంటానని రాహుల్ గాంధీ చెప్పారు. అనర్హత వేటు వేసినా..జైల్లో వేసినా..కొట్టినా వెనకడుగు వేసే ప్రసక్తే లేదన్నారు. అదానీ ఇష్యూను డైవర్ట్ చేయడానికే తనపై అనర్హత వేటు వేశారని చెప్పారు. 

మోడీ దృష్టిలో దేశమంటే అదానీ..

ప్రధాని మోడీ దృష్టిలో దేశమంటే అదానీ..అదానీ అంటే దేశం అని రాహుల్ గాంధీ విమర్శించారు. దేశం తనకు ప్రేమ, గౌరవం ఇచ్చిందని అన్నారు. తనకు అండగా నిలిచిన విపక్షాలకు ధన్యవాదాలు తెలిపారు. మోడీకి భయం పట్టుకుందని..ఆయనే విపక్షాలకు ఆయుధం ఇచ్చారని చెప్పారు.