బీహార్ ఎన్నికల్లో మా పార్టీ నిజాయితీగా కృషి చేసినా ఓటమి పాలైందని, అయితే ఆ బాధ్యత నూటికి నూరు శాతం తనదేనని జన సురాజ్ పార్టీ వ్యవస్థాపకులు ప్రశాంత్ కిషోర్ ఎన్నికల తర్వాత జరిగిన తొలి మీడియా సమావేశంలో మంగళవారం తెలిపారు. మా పార్టీ ఓడిపోయినా, తప్పులను సరిదిద్దుకుని మరింత బలంగా తిరిగి వస్తుందని, వెనక్కి తగ్గేది లేదని ఆయన స్పష్టం చేశారు. "నిజాయితీగా ప్రయత్నించాం కానీ విఫలమయ్యాం, దానికి పూర్తి బాధ్యత నాదే. ఎదురుదెబ్బ తగిలింది కానీ తప్పులు దిద్దుకుని, మమ్మల్ని మేము బలోపేతం చేసుకుంటాం, బలంగా తిరిగి వస్తాం, వెనకడుగు వేసేది లేదు అని ప్రశాంత్ కిషోర్ అన్నారు.
ప్రశాంత్ కిషోర్ మాట్లాడుతూ మా తరపున మేము మంచి ప్రయత్నం చేశాం. ఈ ప్రభుత్వాన్ని మార్చడంలో మాత్రం విఫలమయ్యాం. చాలా కృషి చేసిన.. ఎక్కడో ఫెయిల్ అయ్యాం. ప్రజల మనసులను అర్థం చేసుకోవడంలో నేను విఫలమయ్యాను కాబట్టి, ఆ నిందంతా నాపైనే వేసుకుంటాను. మేము చేసిన ప్రయత్నాలను సమీక్షించుకుంటాం. నా ప్రయత్నాలు విఫలమైనందుకు క్షమించండి అని అన్నారు.
ఓట్లు రాలేదంటే అది నేరం కాదు. నా వైపు నుంచి తప్పులు జరిగి ఉండవచ్చు, కానీ ఎలాంటి నేరం చేయలేదని, ఓట్లు రాకపోవడం నేరం కాదని అన్నారు. మేము కుల రాజకీయాలు చేయలేదు, హిందూ-ముస్లిం గొడవల్లోకి వెళ్లలేదు. సమాజంలో విషాన్ని పెంచలేదు. పేద ప్రజల నుంచి ఓట్లు కొనడం లాంటి నేరం కూడా చేయలేదు. ఈ తప్పులు చేసిన వారే అనుభవిస్తారు.
►ALSO READ | తాత చనిపోయాడు.. ఆఫీస్కు రాలేను సర్ అంటే.. మేనేజర్ రిప్లై ఏంటో చూడండి.. ఏకి పారేస్తున్న నెటిజన్లు !
స్వతంత్ర భారతదేశంలో మొదటిసారిగా ప్రజల కోసం రూ.40 వేల కోట్లు ఖర్చు చేస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం ఇదేనని, అందుకే ఎన్డీఏకు ఇంత పెద్ద మెజారిటీ వచ్చిందని ఆయన అభిప్రాయపడ్డారు. ఓటర్లు వారి ఓట్లను రూ.10 వేలకు అమ్ముకున్నారని కొందరు అంటున్నారు. అది నిజం కాదు.. ఇక్కడి ప్రజలు వారి భవిష్యత్తును లేదా పిల్లల భవిష్యత్తును అమ్ముకోరు. ఈ చర్చకు ముగింపు ఉండదు. ఎన్నికల సంఘం తప్పు చేసిందని కొందరు ఆరోపిస్తున్నారు, అది వారి ఇష్టం. కానీ ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో కనీసం 60వేల –62వేల మందికి రూ.10 వేలు ఇచ్చి, రూ.2 లక్షల రుణం ఇస్తామని హామీ ఇచ్చారు. ఎన్డీఏ మళ్లీ అధికారంలోకి వస్తే లోన్ వస్తుందని ప్రభుత్వ అధికారులు ప్రజలకు చెబుతున్నారు, దీని కోసం జీవికా దీదీలను ఉపయోగించారన్నారు.
మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తూ, తాను ఏ పదవిలో లేను కాబట్టి రాజీనామా చేయాల్సిన అవసరం లేదని ప్రశాంత్ కిషోర్ అన్నారు. నేను బీహార్ వదిలి వెళ్తానని ఎప్పుడూ చెప్పలేదు. నేను రాజకీయాలు చేయనని చెప్పాను. అది ఇప్పటికీ వాస్తవమే. నేను చేసేది రాజకీయాలు కాదు ప్రజల గొంతుకను వినిపించడం రాజకీయాలు కాదు అని ఆయన వివరించారు.
బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో మా పార్టీ ఘోరంగా ఓడిపోయిన తర్వాత, నితీష్ ప్రభుత్వం ఎన్నికల ముందు హామీ ఇచ్చినట్లుగా 1.5 కోట్ల మందికి ఒక్కొక్కరికి రూ.2 లక్షలు ఇస్తే తాను ఖచ్చితంగా రాజకీయాల నుంచి తప్పుకుంటానని ప్రశాంత్ కిషోర్ మరోసారి సవాల్ చేశారు.
