కేసీఆర్, కేటీఆర్..ఉద్యోగాలు ఊడగొట్టాలె: రేవంత్ రెడ్డి

కేసీఆర్, కేటీఆర్..ఉద్యోగాలు ఊడగొట్టాలె: రేవంత్ రెడ్డి

హైదరాబాద్, వెలుగు: ‘‘తొమ్మిదేండ్లు అవుతున్నా కేసీఆర్ సర్కార్ కొలువుల భర్తీ చేపట్టలేదు. ఆయన ఇంట్లో మాత్రం అందరికీ ఉద్యోగాలు ఇచ్చుకున్నడు. కేసీఆర్, కేటీఆర్ ఉద్యోగాలు ఊడగొడితేనే మన పిల్లలకు కొలువులొస్తయ్..” అని పీసీసీ చీఫ్ రేవంత్​రెడ్డి అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే కర్నాటకలో అమలు చేసిన పథకాలు ఇక్కడా ఇంప్లిమెంట్ చేస్తామని హామీ ఇచ్చారు. తమ స్కీమ్స్​ను కేసీఆర్ కాపీ కొట్టాలని చూస్తున్నారని విమర్శించారు. అయినా, తెలంగాణ ప్రజలు కేసీఆర్​ను నమ్మే పరిస్థితి లేదన్నారు. గురువారం ఆదిలాబాద్, ఉప్పల్, మహేశ్వరం, షాద్​నగర్​కు చెందిన వివిధ పార్టీల నేతలు, కార్యకర్తలు రేవంత్ సమక్షంలో జూబ్లీహిల్స్​లోని ఆయన ఆఫీస్​లో కాంగ్రెస్ కండువాలు కప్పుకున్నారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే పేదలు ఇండ్లు కట్టుకునేందుకు రూ.5 లక్షల ఆర్థిక సాయం చేస్తామన్నారు. ‘‘రైతులకు రూ.2లక్షల వరకు రుణమాఫీ చేస్తాం. ఆరోగ్యశ్రీ ద్వారా పేదలకు అందించే చికిత్స ఖర్చును రూ.5 లక్షలకు పెంచుతాం. రూ.500కే గ్యాస్ సిలిండర్ అందజేస్తాం. కర్నాటకలోలాగా తెలంగాణలోనూ మహిళలకు బస్సుల్లో ఫ్రీ జర్నీ అమలు చేస్తాం’’ అని రేవంత్ ప్రకటించారు. 

జోగు రామన్న కాదు.. జోకుడు రామన్న

ఆదిలాబాద్​లో ఆదివాసీలు, గిరిజనులు, మైనారిటీలకు కేసీఆర్ సర్కార్ ఏం చేయలేదని రేవంత్​ మండిపడ్డారు. గూడేల్లో కనీసం తాగునీటి సౌకర్యం లేదన్నారు. తమ్మిడిహెట్టి ద్వారా జిల్లాకు నీళ్లివ్వాలని భావించినా.. రాష్ట్ర సర్కారు ఆ ప్రాజెక్టును పక్కకుపడేసి కాళేశ్వరం ప్రాజెక్టును కట్టి ఆదిలాబాద్ జిల్లాకు అన్యాయం చేసిందని ఫైర్ అయ్యారు. ఆదిలాబాద్ జిల్లాను కాంగ్రెస్ దత్తత తీసుకుంటుందన్నారు. ‘‘జోగు రామన్నను జోకుడు రామన్న అంటే బాగుంటది. జోగు రామన్న అంటే చెల్లని రూపాయి అని కేసీఆర్ డిసైడ్ అయ్యిండు. అందుకే ఆయనకు మళ్లీ మంత్రి పదవి ఇయ్యలే. గృహ నిర్మాణ శాఖ  మంత్రిగా ఉన్నా అక్కడి ప్రజలకు కనీసం ఇండ్లు ఇప్పించలేకపోయిండు” అని రేవంత్ రెడ్డి విమర్శించారు. 

కేసీఆర్​కు బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నరు

రాష్ట్రంలో కాంగ్రెస్​ను గెలిపించి సోనియా గాంధీకి బర్త్​డే గిఫ్ట్ ఇద్దామని రేవంత్ ​రెడ్డి నేతలు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కేసీఆర్ మాయమాటలు నమ్మి ప్రజలు మోసపోయారన్నారు. బీజేపీ ఎన్ని కుట్రలు చేసినా కర్నాటక ప్రజలు కాంగ్రెస్​ను గెలిపించారని గుర్తు చేశారు. ఇప్పుడు తెలంగాణలో కేసీఆర్​కు బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. కాంగ్రెస్ కార్యకర్తలు గ్రామాల్లో తిరిగి ప్రజా సమస్యలు తెలుసుకోవాలన్నారు. ఎప్పుడూ ప్రజల్లో ఉండి పార్టీ విజయం కోసం కృషి చేయాలని రేవంత్ ​రెడ్డి సూచించారు.