న్యూఢిల్లీ: ఇండియా లెజెండరీ బ్యాటర్ సచిన్ టెండూల్కర్.. నీట్ వివాదంపై స్పందించాడు. విద్యార్థులు వ్యక్తం చేస్తున్న నిరాశ, ఆవేదన పూర్తిగా సమర్థనీయమేనని అన్నాడు. వారికి మళ్లీ ఇలాంటి పరిస్థితి ఎదురుకాకుండా చూడాల్సిన బాధ్యత సమాజంపై ఉందని స్పష్టం చేశాడు. ఓడిపోవడం సహజమే. కానీ మోసం చేయడం సరైంది కాదు.
అదే టైమ్‌లో అడ్డదారులు తొక్కడం ఎప్పుడూ క్షమించారనిదని తన తండ్రి చెప్పిన మాటలను గుర్తు చేశాడు. ఈ మేరకు ఎక్స్‌లో పోస్ట్ చేశాడు. కష్టపడి చదివిన కష్టానికి తగిన ప్రతిఫలం దక్కనప్పుడు విద్యార్థులు తీవ్ర మనస్తాపానికి గురికావడం సహజమని సచిన్ అభిప్రాయపడ్డాడు.
శ్రమ కంటే ఫలితానికే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చే సమాజంలోనే ప్రతిభను పక్కనపెట్టి దొడ్డిదారులను వెతుక్కుంటారన్నాడు. ప్రతిభకు, నిజాయితీకి పెద్దపీట వేసే సంస్కృతిని ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నాడు.
జంతర్ మంతర్ వద్ద గత కొన్ని రోజులుగా విద్యార్థులు చేపట్టిన నిరసనలు ఉద్రిక్తంగా మారిన నేపథ్యంలో సచిన్ స్పందన ప్రాధాన్యత సంతరించుకుంది. విద్యార్థుల భవిష్యత్తుకు భరోసా ఇచ్చేలా అందరూ కలిసి పరిష్కారం దిశగా ముందుకు సాగాలని మాస్టర్ ఆకాంక్షించాడు.
