- గురువారం ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఆఫీస్ వద్ద ఆత్మహత్యాయత్నం
- 95 శాతం కాలిన గాయాలతో శుక్రవారం మధ్యాహ్నం కన్నుమూత
- 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని గాంధీ హాస్పిటల్వద్ద బీసీ సంఘాల ఆందోళన
పద్మారావునగర్/ముషీరాబాద్/బషీర్‌బాగ్/జీడిమెట్ల, వెలుగు: పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యకు యత్నించిన సాయి ఈశ్వర్ చారి (30) గాంధీ హాస్పిటల్లో చికిత్స పొందుతూ శుక్రవారం మధ్యాహ్నం మృతి చెందాడు. గురువారం సాయంత్రం మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా మేడిపల్లిలోని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కార్యాలయానికి వెళ్లిన చారి.. మల్లన్నను కలవాలని సిబ్బందికి తెలిపాడు. ప్రస్తుతం ఆయన అందుబాటులో లేరని.. తర్వాత రావాలని చెప్పి పంపించారు. దీంతో కిందకు వచ్చిన చారి.. అక్కడే కార్యాలయం ఎదుట పెట్రోల్ పోసుకుని నిప్పుంటించుకున్నాడు.
వెంటనే స్థానికులు గాంధీ ఆస్పత్రికి తరలించారు. దాదాపు 90 నుంచి -95 శాతం కాలిన గాయాలతో శుక్రవారం మధ్యాహ్నం గాంధీ హాస్పిటల్లో చికిత్స పొందుతూ చారి మృతి చెందినట్టు డాక్టర్లు తెలిపారు. సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలం పోచారం గ్రామానికి చెందిన సాయి ఈశ్వర్ చారి.. ఉపాధి కోసం జగద్గిరిగుట్టలో నివాసం ఉంటూ క్యాబ్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. అతనికి భార్య కవిత, తల్లి ప్రమీలతో పాటు మూడు, రెండేండ్లలోపు ఇద్దరు కుమార్తెలు, ఓ కొడుకు ఉన్నారు.
గాంధీ వద్ద తీవ్ర ఉద్రిక్తత
సాయి ఈశ్వర్‌చారి మరణంతో గాంధీ ఆస్పత్రి వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఉదయం నుంచి వందలాది బీసీ సంఘాల కార్యకర్తలు ఆస్పత్రి వద్ద నిరసన చేపట్టారు. పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకొని బొల్లారం, తిరుమలగిరి, అంబర్‌పేట్, ఉప్పల్ పోలీస్ స్టేషన్లకు తరలించారు. బీసీ జేఏసీ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న, మాజీ ఐఏఎస్ చిరంజీవులు, చెరుకు సుధాకర్, మణిమంజరి, జూలూరి గౌరిశంకర్, పూర్ణచందర్‌తో సహా అనేక మంది బీసీ నాయకులు, కార్యకర్తలు ఆస్పత్రి మెయిన్బిల్డింగ్ఎదుట బైఠాయించి.. సీఎంకు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని, చారి హెల్త్ బులెటిన్నువిడుదల చేయాలని, సీఎం రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
అలాగే, జగద్గిరిగుట్టలో చారి భౌతిక కాయానికి బీఆర్ఎస్ నేతలు, మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్, దాసోజు శ్రవణ్, ఎమ్మెల్యే వివేకానందనివాళులు అర్పించారు. కాగా, బీసీ బిడ్డ చారి మరణం పాలకుల పాపమేనని బీసీ పొలిటికల్ ఫ్రంట్ చైర్మన్ బాలగౌని బాలరాజు గౌడ్.. బీసీ, ఎస్సీ, ఎస్టీ జాక్ చైర్మన్ విశారదన్ మహరాజ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల హామీలను నెరవేర్చకపోవడం వల్లే చారి ఆత్మహత్యకు పాల్పడ్డారని, ఇది ముమ్మాటికి ప్రభుత్వ హత్యగానే చూస్తున్నామని బీసీ సంక్షేమ సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి డాక్టర్ ర్యాగ అరుణ్ కుమార్ అన్నారు. చారి మృతిపట్ల తెలంగాణ బీసీ విద్యార్థి జేఏసీ ఆందోళనకు దిగింది.
హిమాయత్ నగర్ వై జంక్షన్ వద్ద రోడ్డుపై నల్ల కండువాలతో బైఠాయించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా జేఏసీ చైర్మన్ వేముల రామకృష్ణ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వ వైఖరి కారణంగానే చారి ఆత్మ బలిదానం చేసుకున్నారని ఆరోపించారు. జగద్గిరిగుట్టలో సాయి ఈశ్వర్‌చారి భౌతిక ఖాయానికి జాగృతి అధ్యక్షురాలు కవిత నివాళులర్పించారు. చారి తల్లి, భార్య, పిల్లలను ఓదార్చారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. బీసీలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన ద్రోహంపై కొట్లాడాలి కాని.. ఆత్మహత్యలు పరిష్కారం కాదన్నారు.
ప్రభుత్వం పై పోరాడి 42 శాతం రిజర్వేషన్లను సాధించుకుందామని.. బీసీ బిడ్డలు ఆవేశపూరిత నిర్ణయాలు తీసుకోవద్దని సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ కోరారు. బీసీ సంఘాలు, రాజకీయ పార్టీలు కలిసి పోరాటం చేసి ప్రభుత్వం మెడలు వంచుతామని, యువత తొందరపాటు చర్యలకు లోనుకావొద్దని ఆయన కోరారు.
