
హైదరాబాద్, వెలుగు: రైతులు, కార్మికులకు వ్యతిరేకంగా కేంద్ర సర్కార్ అమలు చేస్తున్న విధానాలను నిరసిస్తూ సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్‌కేఎం) జులై 9న అఖిల భారత సమ్మె పిలుపునిచ్చింది. బషీర్‌బాగ్ ప్రెస్ క్లబ్‌లో సీనియర్ నేత వడ్డే శోభనాద్రీశ్వర రావు, విస్సా కిరణ్‌కుమార్, పశ్య పద్మ, టి. సాగర్ మాట్లాడారు. ఎంఎస్‌పీకు చట్టబద్ధత కల్పించడం లేదన్నారు. పంటలకు న్యాయమైన ధరలు కల్పించకుండా రైతులను మోదీ ప్రభుత్వం ఇబ్బందులు పెడుతున్నదని ఫైరయ్యారు.
వ్యవసాయాన్ని కార్పొరేట్ కంపెనీలకు అప్పగిస్తోందని ఆరోపించారు.అమెరికాతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం.. భారత రైతులకు నష్టం కలిగిస్తుందన్నారు. మొక్కజొన్న, సోయా, గోధుమ, పాల ఉత్పత్తులపై దిగుమతి సుంకాలు ఎత్తివేయడం వల్ల చిన్న, సన్నకారు రైతుల జీవనోపాధి దెబ్బతింటుందని హెచ్చరించారు. ఈ ఒప్పందంలో వ్యవసాయ ఉత్పత్తులను చేర్చవద్దని, ఎన్‌పీఎఫ్‌ఏఎంను ఉపసంహరించాలని సంయుక్త కిసాన్ మోర్చా డిమాండ్ చేసింది. 9న జరిగే సమ్మెలో కార్మిక సంఘాలు, రైతు సంఘాలు, వ్యవసాయ కార్మికులు పాల్గొనాలని పిలుపునిచ్చింది.