మహా అసెంబ్లీ రద్దుపై సంజయ్ రౌత్ ట్వీట్

మహా అసెంబ్లీ రద్దుపై  సంజయ్ రౌత్ ట్వీట్

మహా సర్కారు పడిపోయే ప్రమాదంలో ఉంది.  ఏక్ నాథ్ షిండే తిరుగుబాటు నేపథ్యంలో ఉద్దవ్ ఠాక్రే ప్రభుత్వ మనుగడ  ప్రశ్నార్థకంగా మారింది. ప్రస్తుతం తన వైపు 40 మంది ఎమ్మెల్యేలున్నారని ఏక్ నాథ్ షిండే ప్రకటించిన నేపథ్యంలో అసెంబ్లీలో మహా వికాస్ అగాఢీ సర్కారు  బలం తగ్గిపోనుంది. ఈ  సంక్షోభ పరిస్థితుల్లో ఉద్ధవ్‌ ఠాక్రే సీఎం పదవికి రాజీనామా చేస్తారన్న వార్తలు వినిపిస్తున్నాయి. అసెంబ్లీ రద్దుపై  శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌ చేసిన ట్వీట్‌ ఈ ఊహాగానాలను మరింత బలపరుస్తోంది. 

మహారాష్ట్ర తాజా రాజకీయాలపై సంజయ్ రౌత్ కీలక ట్వీట్ చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ సంక్షోభం...శాసనసభ రద్దు దిశగా సాగుతోందంటూ ట్విట్టర్ లో పేర్కొన్నారు.  దీంతో మహా అసెంబ్లీ రద్దవుతుందన్న వార్తలకు ఇప్పుడు ఈ ట్వీట్ బలం చేకూర్చింది.  అంతేకాదు..తమకు అధికారం తాత్కాలికమైందని..ప్రస్తుతం అధికారాన్ని కోల్పోయినా..మళ్లీ అధికారంలోకి వస్తామని అంతకుముందు మాట్లాడారు. ఇదిలా ఉంటే సీఎం ఉద్దవ్ ఠాక్రే కుమారుడు ఆదిత్య ఠాక్రే తన ట్విట్టర్ నుంచి రాష్ట్ర మంత్రి అనే పదాన్ని తీసేశారు. ఇది కూడా అసెంబ్లీ రద్దు ఊహాగానాలను బలపరుస్తోంది.  ప్రస్తుతం సంక్షోభ పరిస్థితుల్లో అసెంబ్లీని రద్దు చేయడమే సరైన నిర్ణయమని సీఎం ఉద్దవ్ ఠాక్రే భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై చర్చించేందుకే ఆయన అత్యవసరంగా కేబినెట్ మీటింగ్ ను ఏర్పాటు చేశారని సమాచారం. ఈ సమావేశంలో అసెంబ్లీ రద్దుపై నిర్ణయం తీసుకుని..భేటీ ముగిసిన తర్వాత అధికారికంగా వెల్లడిస్తారని వార్తలు వస్తున్నాయి. 

మరోవైపు రాష్ట్ర సర్కారు పడిపోయే పరిస్ధితిలున్న నేపథ్యంలో...బీజేపీ తమ ఎమ్మెల్యేలకు కీలక ఆదేశాలు జారీ చేసింది.  ఒక్క ఎమ్మెల్యే కూడా ముంబై దాటి వెళ్లొద్దని సూచించింది. 

అటు గవర్నర్ భగత్ సింగ్  కొష్యారీ కొవిడ్తో ఆసుపత్రిలో చేరారు.  రిలయన్స్ ఫౌండేషన్ ఆసుపత్రిలో ఆయన చికిత్స తీసుకుంటున్నారు.