
న్యూఢిల్లీ: జ్యుడీషియల్ అధికారుల పరువుకు భంగం కలిగించేలా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం ముమ్మాటికీ నేరమేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఓ వివాదంలో తనకు అనుకూలంగా తీర్పు రాలేదని రఘువంశీ అనే వ్యక్తి జిల్లా కోర్టు జడ్జిపై అవినీతి ఆరోపణలు చేశాడు. కోర్టు ప్రతిష్టను కించపరిచేలా లెటర్ రాసి దాన్ని వాట్సాప్‌లో వైరల్ చేశాడు. దీంతో అతనిపై కేసు నమోదైంది. ఆధారాలను పరిశీలించిన మధ్యప్రదేశ్ హైకోర్టు రఘువంశీకి 10 రోజుల జైలు శిక్ష విధించింది. ఈ తీర్పును సవాలు చేస్తూ రఘువంశీ సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. ఈ పిటిషన్‌ను జస్టిస్ బేల ఎం త్రివేది, జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రాల వెకేషన్ బెంచ్ విచారించింది. పిటిషనర్ తరఫు లాయర్ వాదిస్తూ.. తన క్లయింట్‌కు శిక్ష విధించడం వ్యక్తిగత స్వేచ్ఛకు ఆటంకం కలిగించడమేనన్నారు. బెంచ్ స్పందిస్తూ.. తాము ఇక్కడున్నది కోర్టు ప్రతిష్టను దిగజార్చేవారిపై దయ చూపడానికి కాదని పేర్కొంది. కోర్టును అవమానించేవారందరికీ ఈ కేసు ఓ గుణపాఠం కావాలని వ్యాఖ్యానించింది.