దేశంలో పదవీ విరమణ చేసిన సీనియర్ సిటిజన్లకు అత్యంత ప్రజాదరణ పొందిన, సురక్షితమైన ప్రభుత్వ పొదుపు పథకాల్లో 'సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్' (SCSS) మొదటి వరుసలో ఉంటుంది. మార్కెట్ రిస్క్‌లతో సంబంధం లేకుండా.. జీవితాంతం కష్టపడి దాచుకున్న మూలధనానికి పూర్తి రక్షణ కల్పిస్తూ స్థిరమైన ఆదాయాన్ని అందించడం ఈ స్కీమ్ ప్రత్యేకత. ప్రస్తుతం ఇండియా పోస్ట్ రూల్స్ ప్రకారం.. ఒక ఆర్థిక సంవత్సరంలో ఒక వ్యక్తి గరిష్టంగా రూ.30 లక్షల వరకు ఇందులో పెట్టుబడి పెట్టవచ్చు. దీనివల్ల భార్యాభర్తలు ఇద్దరూ కలిసి ఉమ్మడిగా గరిష్టంగా రూ.60 లక్షల వరకు డిపాజిట్ చేసుకునే అవకాశం కల్పించారు.
ఒకవేళ వృద్ధ దంపతుల వద్ద రూ.50 లక్షల క్యాష్ ఉన్నట్లయితే.. దానిని ఈ స్కీమ్ లో పెట్టుబడి పెట్టడం ద్వారా ఎంత స్థిర ఆదాయం వస్తుందో లెక్కలు చూద్దాం. ప్రస్తుతం ఈ పథకానికి ప్రభుత్వం ఏడాదికి 8.2 శాతం వడ్డీని అందిస్తోంది. ఈ వడ్డీ రేటు 5 ఏళ్ల కాలపరిమితికి స్థిరంగా ఉంటుందని భావిస్తే.. రూ.50 లక్షల పెట్టుబడిపై ఏడాదికి రూ.4లక్షల 10వేలు వడ్డీ లభిస్తుంది. ఈ పథకంలో వడ్డీని ప్రతి మూడు నెలలకు ఒకసారి చెల్లిస్తారు. ఆ రకంగా ప్రతి త్రైమాసికానికి రూ.లక్షా 2వేల 500 అకౌంట్లో జమ అవుతుంది. దీనిని నెలవారీగా విభజిస్తే నెలకు సుమారు రూ. 34వేల 167 లభిస్తుంది. 5 ఏళ్ల కాలపరిమితి ముగిసేసరికి మొత్తం రూ.20లక్షల 50వేలు వడ్డీతో పాటు మొత్తం రూ. 70 లక్షల 50వేలు చేతికి అందుతాయి.
పన్ను మినహాయింపుల విషయానికి వస్తే.. పాత పన్ను విధానంలో సెక్షన్ 80C కింద రూ. లక్షా 50వేల వరకు పన్ను మినహాయింపు లభిస్తుంది. అయితే ఒక ఆర్థిక సంవత్సరంలో వచ్చే వడ్డీ ఆదాయం రూ.50వేలు దాటితే 10 శాతం టీడీఎస్ కట్ అవుతుంది. అదే పాన్ కార్డ్ లేకపోతే 20 శాతం కట్ చేస్తారు. ఒకవేళ తమ వార్షిక ఆదాయంపై పన్ను పరిమితి దాటకపోతే.. సీనియర్ సిటిజన్లు 'ఫార్మ్ 15H' సమర్పించి టీడీఎస్ మినహాయింపు పొందవచ్చు.
కొన్ని స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు దీనికంటే కొద్దిగా ఎక్కువ వడ్డీ ఆఫర్ చేసినప్పటికీ.. ప్రభుత్వ గ్యారెంటీ ఉండటం వల్ల రిస్క్ తీసుకోకూడదనుకునే వృద్ధులకు ఎస్సీఎస్ఎస్ స్కీమ్ బెస్ట్ ఎంపిక. అయితే రిటైర్మెంట్ కార్పస్ మొత్తాన్ని ఒకే స్కీమ్ లో పెట్టకుండా.. ద్రవ్యోల్బణాన్ని తట్టుకునేందుకు, అత్యవసర లిక్విడిటీ కోసం కొంత భాగాన్ని ఇతర వృద్ధి ఆధారిత పథకాల్లో కూడా మదుపు చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. 5ఏళ్ల మెచ్యూరిటీ తర్వాత అప్పటి వడ్డీ రేట్లు, ఆర్థిక అవసరాలను బట్టి తిరిగి ఇందులోనే రీఇన్వెస్ట్ చేయాలా లేక ఇతర సురక్షిత మార్గాల్లోకి మళ్లించాలా అనేది నిర్ణయించుకోవాలి.
