- 72 గ్రాముల బంగారు నగలు స్వాధీనం
పద్మారావునగర్, వెలుగు: రైల్వే ప్రయాణికులను లక్ష్యంగా చేసుకుని బంగారు ఆభరణాలు చోరీ చేస్తున్న అంతర్రాష్ట్ర దొంగల ముఠాను సికింద్రాబాద్ రైల్వే పోలీసులు(జీఆర్‌పీ), ఆర్పీఎఫ్ బలగాలు అరెస్ట్ చేశాయి. నిందితుల వద్ద సుమారు రూ.10.80 లక్షల విలువైన 72 గ్రాముల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన ప్రకారం.. పశ్చిమ బెంగాల్ కు చెందిన వర్షా ఖైరుయార్, ఖుష్బూ కుమారి, ఉత్తమ్ ఖైరుయార్ పసిపిల్లలను ఎత్తుకుని ప్రయాణికుల్లా నటిస్తూ చోరీలకు పాల్పడుతున్నారు.
ప్రయాణికుల దృష్టి మళ్లించేందుకు దుప్పట్లలో హ్యాండ్‌బ్యాగులను కప్పి ఉంచి, చాకచక్యంగా జిప్పులు తీసి బంగారు నగలను మాయం చేసేవారు. ఏప్రిల్ 27న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లోని ప్లాట్‌ఫాం నంబర్–1 వద్ద వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ఎక్కుతున్న ఓ మహిళను నెట్టివేసి ఆమె బ్యాగులోని బంగారు నగలను దొంగిలించారు. శుక్రవారం తెల్లవారుజామున మరోసారి చోరీకి ప్రయత్నిస్తుండగా అనుమానం వచ్చిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని విచారించగా అసలు చోరీల విషయం వెలుగులోకి వచ్చింది. నిందితులను పట్టుకున్న పోలీసు సిబ్బందిని రైల్వే, రోడ్డు భద్రత ఐజీ కె.రమేశ్‌నాయుడు అభినందించారు.
ఇద్దరు దోపిడీ దొంగల అరెస్ట్..
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పరిసరాల్లో కత్తితో బెదిరించి నగదు దోచుకున్న ఇద్దరు దొంగలను జీఆర్‌పీ, ఆర్పీఎఫ్ పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి నగదుతో పాటు ఒక ఫోల్డింగ్ నైఫ్‌ను స్వాధీనం చేసుకున్నారు. నేరెడ్‌మెట్‌కు చెందిన తాండూరు మహేందర్, రెజిమెంటల్ బజార్‌లో నివసించే పెగడ అంజలి ఖాళీ సీసాలు ఏరుకుంటూ జీవనం సాగిస్తున్నారు. మద్యానికి బానిసలైన వీరిద్దరూ పలు నేరాలకు పాల్పడి జైలుకు వెళ్లొచ్చారు. ఏప్రిల్ 29న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వద్ద ఓ వ్యక్తిని అడ్డగించి కత్తితో బెదిరించి డబ్బులు డిమాండ్ చేశారు.
బాధితుడు నిరాకరించడంతో మహేందర్ కత్తితో దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. అనంతరం అంజలి బాధితుడి జేబులోని నగదును దోచుకుని అక్కడి నుంచి పరారయ్యారు. రైల్వే ఇన్‌స్పెక్టర్ బి.సాయీశ్వర్ గౌడ్ బృందం, ఆర్పీఎఫ్ సిబ్బందితో కలిసి వారిని అదుపులోకి తీసుకుంది.
