అమెజాన్ అడవుల్లో వింత ప్రపంచం : తొలిసారి కెమెరాకు చిక్కిన రహస్య తెగ మనుషులు!

 అమెజాన్ అడవుల్లో వింత ప్రపంచం : తొలిసారి కెమెరాకు చిక్కిన రహస్య తెగ మనుషులు!

ప్రపంచంలోనే ఎవరితోనూ కలవకుండా, అడవిలోనే విడిగా బతికే ఒక తెగకు సంబంధించిన అద్భుతమైన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పెరూ దేశంలోని దట్టమైన అమెజాన్ అడవుల్లో ఈ దృశ్యాలు రికార్డయ్యాయి.

 దాదాపు 750 మంది జనాభా ఉన్న 'మాష్కో పిరో' అనే తెగ వాళ్ళు  ఈ వీడియోలో కనిపించారు. వీళ్ళు  సాధారణంగా మనుషులకు కనిపించడానికి అస్సలు ఇష్టపడరు.

నది ఒడ్డున ఇసుకలో ఈ తెగ వాళ్ళు నడుచుకుంటూ రావడం వీడియోలో కనిపిస్తుంది. వారి చుట్టూ సీతాకోకచిలుకలు, దట్టమైన చెట్లు ఉన్నాయి. ఇంకా వారి చేతుల్లో స్వయంగా తయారు చేసుకున్న ఆయుధాలు ఉన్నాయి. కెమెరాతో చిత్రీకరిస్తున్న వ్యక్తులను వారు చాలా అనుమానంగా, జాగ్రత్తగా, వింతగా  గమనిస్తున్నారు. మొదట్లో చాలా కోపంగా కనిపించిన ఆ తెగ వాళ్ళు తర్వాత కొంచెం శాంతించారు. బయటి వ్యక్తులు ఒక పడవలో కొన్ని అరటిపండ్లను పెట్టి వారి వైపు పంపారు. ఆ తెగ వారు నెమ్మదిగా పడవ దగ్గరకు వచ్చి, ఆ పండ్లను తీసుకోవడం వీడియోలో చూడవచ్చు.

 పర్యావరణ ప్రేమికుడు పాల్ రోసోలీ ఈ వీడియో గురించి మాట్లాడుతూ.. "ఇలాంటి దృశ్యాలు ప్రపంచంలోనే మొదటిసారి బయటకు వచ్చాయి" అని చెప్పారు. ఈ తెగ వారు చాలా సున్నితమైన వారని, వారి ప్రశాంతతకు భంగం కలిగించకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ వీడియో చూసిన వారంతా.. ఆధునిక ప్రపంచానికి ఏమాత్రం సంబంధం లేకుండా వారు ప్రకృతిలో ఎలా కలిసిపోయారో చూసి ఆశ్చర్యపోతున్నారు.