బీసీలు గొర్రెలు, బర్రెల కులవృత్తులకే పరిమితం కావాలా? 

బీసీలు గొర్రెలు, బర్రెల కులవృత్తులకే పరిమితం కావాలా? 
  • బీసీలు అంటే బ్యాక్ వర్డ్ క్లాస్ కాదు.. బ్యాక్ బోన్ క్లాస్
  • మేం అధికారంలోకి వస్తే ట్యాంక్ బండ్ పై బీసీల విగ్రహాలు ఏర్పాటు చేస్తాం
  • చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలి
  • వైస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల 

కొడంగల్: బలహీన వర్గాలకు చెందిన వారు గొర్రెలు, బర్రెలు, చేపలు పెంచుకునే కుల వృత్తులకే పరిమితం కావాలా.. ? వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రశ్నించారు. బీసీలు అంటే బ్యాక్ వర్డ్ క్లాస్ కాదు.. బ్యాక్ బోన్ క్లాస్ అని ఆమె అభివర్ణించారు. తాము అధికారంలోకి వస్తే ట్యాంక్ బండ్ పై బీసీ మహనీయుల విగ్రహాలు ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించాలని ఆమె డిమాండ్ చేశారు. 
ఆదివారం ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా కొడంగల్ నియోజకవర్గంలోని కోస్గి జూనియర్ కాలేజీలో బడుగు బలహీన వర్గాల హక్కుల సాధన కోసం వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ బీసీ గౌరవ సభ నిర్వహించారు. కార్యక్రమానికి హాజరైన వైఎస్ షర్మిల మాట్లాడుతూ బీసీలకు తగిన ప్రాధాన్యత కల్పించాలన్నారు.  ప్రభుత్వ శాఖల్లో అనేక ఖాళీలు ఉన్నాయని గుర్తు చేస్తూ.. బీసీలకు చట్ట సభల్లో రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేశారు. బీసీలు అంటే బ్యాక్వార్డు క్లాస్ కాదు..బిసిలు అంటే బ్యాక్ బోన్ క్లాస్ అని ఆమె అన్నారు. బీసీలకు తమ పార్టీ ఆత్మగౌరవం కల్పిస్తుందన్నారు. 
సీఎం కేసీఆర్ బీసీలను ఎప్పుడు గౌరవించలేదని ఆమె విమర్శించారు. బీసీ కులాల వారు కుల వృత్తులకు మాత్రమే పరిమితం కావాలా ? బర్రెలు, గొర్రెలు, చేపలు పెంచుకుని బతికేందుకు మాత్రమే పనికి వస్తారా..? కేసీఆర్ కుటుంబం ఆ పనులు చేయరు ఎందుకు..? అని ఆమె ప్రశ్నించారు. బీసీలకు ఎన్నికోట్లు ఖర్చు చేశారో తెలపాలని డిమాండ్ చేశారు. బీసీల జనాభా లెక్కల్లో ఏ కులంలో ఎంత మంది ఉన్నారో తేల్చాలన్నారు. కేసీఆర్  సమగ్ర సర్వే పేరుతో కోట్ల రూపాయలు ఖర్చు చేశారని అన్నారు. 
కేసీఆర్ కు ఎన్నికలప్పుడే బిసిలు గుర్తుకు వస్తారని, ఉద్యమంలో బీసీలను వాడుకుని  చట్ట సభలలో వారికి అవకాశం ఇవ్వలేదన్నారు. వైస్సార్ తెలంగాణ పార్టీ వస్తే అసంబ్లీ లో బీసీ లకు ప్రాధాన్యత ఇస్తామని వైఎస్ షర్మిల ప్రకటించారు. ఈ సందర్భంగా తమ పార్టీ అధికారిక వెబ్ సైట్.. www.ysrtelangana.com ప్రారంభించారు.