
బెంగళూరులోని సుద్దగుంటెపాల్యలో ఓ పీజీ హాస్టల్లోకి దొంగ ప్రవేశించి ఓ మహిళపై లైంగిక వేధింపులకు పాల్పడటమే కాకుండా ఆమె వద్ద ఉన్న డబ్బు దోచుకున్నాడు. ఈ ఘటన గత శుక్రవారం జరిగింది. అయితే హాస్టల్‌లోని సీసీటీవీలో ఒక వ్యక్తి బిల్డింగ్లోకి వెళ్లడం, కొద్దిసేపటి తర్వాత ఓ మహిళ అతన్ని తరిమికొట్టడం స్పష్టంగా కనిపిస్తుంది.
బాధితురాలు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం, ఆ దొంగ ఆమె పడుకున్నప్పుడు వచ్చి ఆమెను పట్టుకున్నాడు. ఆమె ఎదురుతిరగడంతో ఆమె గదిలోంచి రూ.2,500 తీసుకుని పారిపోయాడు. ఈ ఘటనపై సుద్దగుంటెపాల్య పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు కాగా, నిందితుడి కోసం పోలీసులు గాలింపులు చేస్తున్నారు.
ఇదే కాకుండా గత నెలలో బెంగళూరులో మరో పీజీ హాస్టల్లో ఒక కాలేజీ విద్యార్థినిపై హాస్టల్ ఓనర్ అష్రఫ్ అత్యాచారం చేసినట్లు పోలీసులు తెలిపారు. ఆగస్టు 3న జరిగిన ఈ ఘటనపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.
ఆమె ఫిర్యాదు ప్రకారం పీజీ హాస్టల్ ఓనర్ రాత్రిపూట ఆమె గదికి వచ్చి తనతో పాటు రమ్మని అడిగాడు. ఆమె నిరాకరించడంతో బలవంతంగా కారులోకి ఎక్కించుకొని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారం చేశాడని ఆరోపించింది. పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడు అష్రఫ్‌ను అరెస్టు చేశారు.