నర్సంపేట, వెలుగు: గ్రామ పంచాయతీ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని ఎన్నికల ఆఫీసర్లను ఆదేశించారు. శుక్రవారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణి కుముదిని జిల్లా కలెక్టర్లు, ఎన్నికల పరిశీలకులు, పోలీస్ అధికారులతో ఎన్నికల నిర్వహణ పై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో నర్సంపేట ఆర్డీవో కార్యాలయం నుంచి కలెక్టర్ సత్య శారద, సాధారణ పరిశీలకులు బాలమాయాదేవి, అడిషనల్ కలెక్టర్ సంధ్యారాణితో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎన్నికల సంఘం కమిషనర్ మాట్లాడుతూ నామినేషన్ల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించిన సిబ్బంది కేటాయింపు, పోస్టల్ బ్యాలెట్, బ్యాలెట్ బాక్సుల అంశాల పై సమీక్షించారు.
అనంతరం వరంగల్ జిల్లా రిటర్నింగ్ఆఫీసర్, కలెక్టర్ సత్యశారద మాట్లాడుతూ మొదటి దశ పోలింగ్‌కు కావల్సిన బ్యాలెట్ పత్రాలను సంబంధిత ఎంపీడీవోలకు అందజేసినట్లు తెలిపారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని చెప్పారు. అనంతరం కలెక్టర్ చెన్నారావుపేటలో నామినేషన్ సెంటర్‌ను పరిశీలించారు. సదుపాయాలపై ఆరా తీశారు. ఆమెవెంట జడ్పీ సీఈవో రామిరెడ్డి, ఇతర అధికారులు ఉన్నారు.
