
- రాష్ట్రవ్యాప్తంగా స్టూడెంట్ యూనియన్ల ఆందోళన
- 20, 21 తేదీల్లో ఇంటర్ కాలేజీల బంద్‌కు పిలుపు
హైదరాబాద్, వెలుగు: ఇంటర్ ఫస్టియర్‌లో ఫెయిలైన స్టూడెంట్లను పాస్ చేయాలని కోరుతూ రాష్ట్రవ్యాప్తంగా రెండో రోజూ శనివారం స్టూడెంట్ యూనియన్లు ఆందోళనలు కొనసాగించాయి. ఏబీవీపీ, ఎన్ఎస్యూఐ సంఘాలు ఇంటర్ బోర్డును ముట్టడించగా, ఏఐఎస్ఎఫ్, బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ఎడ్యుకేషన్ మినిస్టర్ క్యాంప్ ఆఫీసు ముందు ధర్నా చేశారు. ఓయూ ఆర్ట్స్ కాలేజీ ముందు ఎస్ఎఫ్ఐ నేతలు నిరసన తెలుపగా, ఎన్సీసీ గేటు ముందు టీఎస్ యూ నేతలు సర్కారు దిష్టిబొమ్మను దహనం చేశారు. సర్కారు, ఇంటర్ బోర్డు నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ స్టూడెంట్స్యూనియన్లు ఈనెల 20, 21 తేదీల్లో జూనియర్ కాలేజీల బంద్‌కు పిలుపునిచ్చాయి.
ఇంటర్ బోర్డు వద్ద ఉద్రిక్తం
రిజల్ట్‌లో టెక్నికల్ లోపాలను సవరించాలని, ఫ్రీగా రీవాల్యువేషన్ చేయాలని కోరుతూ ఏబీవీపీ ఆధ్వర్యంలో స్టూడెంట్లు ఇంటర్ బోర్డును ముట్టడించారు. లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. వారంతా అక్కడే బైఠాయించి నిరసన తెలిపారు. పోలీసులు వారిని బలవంతంగా అరెస్టు చేసి నాంపల్లి, బేగంబజార్, అబిడ్స్ పోలీస్ స్టేషన్లకు తరలించారు. ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి ప్రవీణ్‌రెడ్డి, సెంట్రల్ వర్కింగ్ కమిటీ మెంబర్ శ్రీహరి మాట్లాడుతూ.. కరోనా పరిస్థితుల్లో సర్కారు నిర్లక్ష్యం చేయడం వల్లే ఇంటర్ ఫలితాల్లో గందరగోళం నెలకొందన్నారు. ప్రభుత్వం లక్షల మంది స్టూడెంట్ల మానసిక క్షోభకు కారణమైందని మండిపడ్డారు. అరెస్ట్అయిన వారిలో జాతీయ కార్యవర్గ సభ్యులు శ్రీశైలం వీరమళ్ల, స్టేట్ జాయింట్ సెక్రటరీ సుమన్ శంకర్, లీడర్లు కమల్ సురేశ్, అరవింద్, శ్రీకాంత్, మహేష్, శ్రీనాథ్ తదితరులున్నారు.
ఎన్ఎస్ యూఐ రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్ నేతృత్వంలో స్టూడెంట్లతో కలిసి ఇంటర్ బోర్డుకు ర్యాలీగా వెళ్లారు. పోలీసులు వారిని అడ్డుకున్నారు. స్టూడెంట్లకు, పోలీసులకు మధ్యతోపులాట జరిగింది. వారిని బలవంతంగా అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. అధికారులను కలిసి మెమోరాండం ఇస్తామంటే అరెస్టు చేయడం ఏమిటని వెంకట్ ప్రశ్నించారు.
క్యాంపు ఆఫీసు వద్ద ఆందోళన
ఫస్టియర్ స్టూడెంట్లకు న్యాయం చేయాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి క్యాంప్ ఆఫీసు ముందు ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో స్టూడెంట్లు ఆందోళనకు దిగారు. ఆఫీసును ముట్టడించేందుకు వచ్చిన స్టూడెంట్స్‌ను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో వారు రోడ్డుపైనే కూర్చొని ధర్నా చేశారు. పోలీసులు వారిని అరెస్టు చేసి అబిడ్స్, రాంగోపాల్‌పేట స్టేషన్లకు తరలించారు. సర్కారు, ఇంటర్ బోర్డు బాధ్యతారాహిత్యమే స్టూడెంట్ల ఆత్మహత్యలకు కారణమని ఏఐఎస్ఎఫ్స్టేట్ ప్రెసిడెంట్ అశోక్ స్టాలిన్ అన్నారు. సగానికి పైగా విద్యార్థులు ఫెయిల్ కావడం దురదృష్టకరమన్నారు. ఇప్పటికే ఫెయిలైన ముగ్గురు స్టూడెంట్లు ఆత్మహత్య చేసుకున్నారని, మరో స్టూడెంట్ ఆత్మహత్యాయత్నం చేసిందని గుర్తు చేశారు. ఏఐఎస్ఎఫ్ లీడర్లను పోలీసులు అరెస్ట్‌చేశారు.
బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో విద్యాశాఖ మంత్రి ఆఫీసు ముందు ఆందోళన చేశారు. ఫస్టియర్‌లో తక్కువ శాతం ఉత్తీర్ణతతో స్టూడెంట్స్ ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని, అందరినీ పాస్ చేయాలని ఆర్.కృష్ణయ్య కోరారు. అందరికీ ప్రతి సబ్జెక్ట్‌లో 30 గ్రేస్ మార్కులు కలపాలన్నారు. అవగాహన లేని లెక్చరర్లతో వాల్యుయేషన్ చేయించారని, అందుకే రిజల్ట్స్ తక్కువగా వచ్చాయన్నారు.
జిల్లాల్లోనూ నిరసనలు
రాష్ట్రవ్యాప్తంగా ఆయా జిల్లా కేంద్రాల్లోనూ విద్యార్థి సంఘాల నేతలు ర్యాలీలు, రాస్తారోకోలు, ధర్నాలతో నిరసన తెలిపారు. స్టూడెంట్స్ఆత్మహత్యలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని, విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఖమ్మం జిల్లా ముదిగొండ, మెదక్, సిద్దిపేట, వనపర్తి జిల్లా కేంద్రాల్లో సీఎం కేసీఆర్ దిష్టి బొమ్మ దహనం చేశారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో సబిత, దేవరగొండలో రాష్ట్ర ప్రభుత్వం, కామారెడ్డిలో విద్యా శాఖ మంత్రి, ఇంటర్మీడియట్బోర్డు కమిషనర్దిష్టిబొమ్మలు దహనం చేసి నిరసన తెలిపారు. జనగామ, సిరిసిల్ల, నిజామాబాద్డీఐఈవో ఆఫీసుల ముందు ఏబీవీపీ, టీజీవీపీ ఆధ్వర్యంలో ధర్నాలు చేశారు. ఖమ్మం, నిర్మల్, సూర్యాపేట, ఆర్మూర్‌లో ర్యాలీలు నిర్వహించారు. వరంగల్‌లోని ములుగు రోడ్డు సెంటర్లో ఏబీవీపీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టడంతో రెండు గంటలకు పైగా ట్రాఫిక్ స్తంభించింది. ఆదిలాబాద్కలెక్టరేట్ముందు ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ధర్నా చేశారు.
రేపు, ఎల్లుండి కాలేజీల బంద్
స్టూడెంట్లకు న్యాయం చేయాలని కోరుతూ ఈనెల 20న ఎన్ఎస్ యూఐ, 21న ఏబీవీపీ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జూనియర్ కాలేజీల బంద్‌కు పిలుపునిచ్చాయి. అక్రమ అరెస్టులను నిరసిస్తూ సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా సర్కారు దిష్టిబొమ్మల దహనం కార్యక్రమం చేపట్టనున్నట్లు ఏబీవీపీ నేతలు ప్రకటించారు.