
- ఏపీలో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కేసులో సుప్రీంకోర్టు ఉత్తర్వులు
న్యూఢిల్లీ, వెలుగు: మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్‌కు సంబంధించిన కేసులో విచారణకు హాజరుకావాల్సిందేనని సినీ నటుడు మోహన్ బాబుకు సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ కేసులో తనను క్వాష్ (తొలగింపు) చేయాలని కోరిన విజ్ఞప్తిని తోసిపుచ్చింది. తన విద్యాసంస్థల్లో ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించాలని కోరుతూ 2019లో తిరుపతి-మదనపల్లె హైవేపై స్టూడెంట్స్‌తో కలిసి మోహన్ బాబు కుటుంబం ఆందోళన చేపట్టింది. ఆ టైంలో రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమలులో ఉండడంతో మంచు ఫ్యామిలీపై మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో తనను క్వాష్ చేయాలని కోరుతూ మోహన్ బాబు దాఖలు చేసిన పిటిషన్‌ను బుధవారం జస్టిస్ బేలా ఎం.త్రివేది, జస్టిస్ సతీష్ చంద్ర శర్మల బెంచ్ విచారణ జరిపింది.
మోహన్ బాబు సమాజంలో బాధ్యత కలిగిన వ్యక్తి అని, ఆయన విద్యాసంస్థలు నడుపుతున్నారని, 75 ఏండ్ల వయసని ఆయన తరఫు అడ్వకేట్ నిఖిల్ గోయల్ కోర్టుకు నివేదించారు. ప్రైవేట్ వ్యక్తులపై ఎన్నికల ప్రవర్తనా నియమావళి వర్తించదని, ఫీజు రీయింబర్స్‌మెంట్ కోసం చేసిన ధర్నాను మోడల్ కోడ్ కండక్ట్ కింద చూడలేమని వాదించారు. అయితే, విచారణను నాలుగు వారాలకు వాయిదా వేస్తున్నట్లు న్యాయమూర్తి వెల్లడించారు. కాగా, పిటిషనర్ అడ్వకేట్ జోక్యం చేసుకొని.. ఏపీ ప్రభుత్వానికి నోటీసు ఇవ్వాలన్న విజ్ఞప్తిని ధర్మాసనం తోసిపుచ్చింది. కనీసం మే 2వ తేదీన తిరుపతి మేజిస్ట్రేట్ ఎదుట విచారణకు హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని రిక్వెస్ట్‌ను కూడా పక్కబెట్టింది.