బల్వంత్ సింగ్ రాజోనాకు సుప్రీంకోర్టులో చుక్కెదురు

బల్వంత్ సింగ్ రాజోనాకు సుప్రీంకోర్టులో  చుక్కెదురు

న్యూఢిల్లీ: పంజాబ్ మాజీ సీఎం బియాంత్ సింగ్ హత్య కేసులో ఉరిశిక్ష పడిన బల్వంత్ సింగ్ రాజోనాకు సుప్రీంకోర్టులో  లభించలేదు. ఆయనకు పడిన ఉరిశిక్షను జీవిత ఖైదుగా మార్చేందుకు కోర్టు నిరాకరించింది. రాజోనా క్షమాభిక్ష పిటిషన్ పై సంబంధిత అధికారులు నిర్ణయం తీసుకుంటారని స్పష్టం చేసింది. తగిన సమయంలో క్షమాభిక్ష పిటిషన్ పై నిర్ణయం తీసుకోవాలని కేంద్ర హోంశాఖను ఆదేశించింది. ఈ మేరకు జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సంజయ్ కరోల్ తో కూడిన బెంచ్ బుధవారం తీర్పు ఇచ్చింది. 26 ఏండ్లుగా జైల్లో ఉన్న రాజోనా.. తన శిక్షను తగ్గించాలని కోరుతూ 2020లో సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు.. వాదనల అనంతరం ఈ ఏడాది మార్చి 2న తీర్పును వాయిదా వేసింది. 

1995 పేలుడు కేసులో.. 

పంజాబ్ లోని లుధియానాకు చెందిన బల్వంత్ సింగ్ రాజోనా మాజీ పోలీస్ కానిస్టేబుల్. ఖలిస్తాన్ ఉద్యమంలో భాగంగా 1995 ఆగస్టులో చండీగఢ్ లోని సెక్రటేరియెట్ కాంప్లెక్స్ లో బాంబు పేలుడు జరిగింది. ఇందులో అప్పటి కాంగ్రెస్ సీఎం బియాంత్ సింగ్ సహా 17 మంది చనిపోయారు. ఈ కేసులో బల్వంత్ సింగ్ రాజోనా ప్రమేయం ఉందని తేల్చిన పోలీసులు.. అతణ్ని అరెస్టు చేశారు. అప్పటి నుంచి రాజోనా జైలులోనే ఉన్నాడు. 2007లో సీబీఐ స్పెషల్ కోర్టు అతనికి ఉరి శిక్ష విధించింది. అయితే తనకు క్షమాభిక్ష పెట్టాలని రాజోనా 2012లో కేంద్రాన్ని కోరాడు. అప్పటి నుంచి ఆ పిటిషన్ పెండింగ్ లో ఉండడంతో రాజోనా సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు.. క్షమాభిక్ష పిటిషన్ పై నిర్ణయం తీసుకోవాలని కేంద్రాన్ని ఆదేశించింది. అయితే భద్రత కారణాల దృష్ట్యా నిర్ణయాన్ని వాయిదా వేస్తున్నామని కోర్టుకు కేంద్రం తెలిపింది.