1971 నాటి ఇండో-పాక్ యుద్ధంలో మనవాళ్లు విక్టరీ కొట్టి 50 ఏండ్లు పూర్తయ్యింది. దీనికి గుర్తుగా దేశవ్యాప్తంగా స్వర్ణిమ్ విజయ్ విక్టరీ పేరిట వేడుకలు నిర్వహించారు. గత ఏడాది డిసెంబర్ 16న ఢిల్లీలో జాతీయ యుద్ధ స్మారకం దగ్గర స్వర్ణిమ్ విజయ్ విక్టరీ ఫ్లేమ్ను ప్రధానమంత్రి నరేంద్రమోడీ వెలిగించారు. అక్కడి నుంచి వివిధ నగరాలను చుడుతూ ఈ ఫ్లేమ్ దేశంలోని అన్ని ప్రాంతాలకు చేరింది. మంగళవారం ఈ ఫ్లేమ్ సియాచిన్ గ్లేషియర్కు చేరుకుంది. సముద్ర మట్టానికి 22 వేల అడుగుల ఎత్తులో ఉన్న బానా పోస్ట్ దగ్గర మిలిటరీ గౌరవ వందనంతో ఈ ఫ్లేమ్ను ఆర్మీ రిసీవ్ చేసుకుంది. దేశ రక్షణకు కట్టుబడి ఉంటామని ఈ సందర్భంగా జవాన్లు ప్రతిజ్ఞ చేశారు.
