రీల్స్ పిచ్చితో యువకుడి ప్రాణం తీసిన మైనర్: 10th పరీక్షల కోసం బెయిల్ మంజూరు..

రీల్స్ పిచ్చితో యువకుడి ప్రాణం తీసిన మైనర్: 10th పరీక్షల కోసం బెయిల్ మంజూరు..

ఢిల్లీలో జరిగిన ఓ  ఘోర రోడ్డు ప్రమాదం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. సరదా కోసం చేసిన ఓ  రీల్ ఒక నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. ఫిబ్రవరి 3న ఢిల్లీలోని ద్వారకా ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. 17 ఏళ్ల ఓ మైనర్ బాలుడు అతని తండ్రి కారును ఓవర్ స్పీడుతో నడుపుతూ రోడ్డుపై స్టంట్లు చేశాడు. ఈ క్రమంలో ఎదురుగా వస్తున్న సాహిల్ ధనేష్రా (23) అనే యువకుడి బైకుని బలంగా ఢీకొట్టి, ఆ తర్వాత పక్కనే ఉన్న ఒక టాక్సీని కూడా గుద్దేశాడు. ఈ ప్రమాదంలో సాహిల్ అక్కడికక్కడే మరణించగా, టాక్సీ డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డాడు.

పరీక్షల కోసం బెయిల్:
అయితే ప్రమాదంకి కారణమైన బాలుడుకి  డ్రైవింగ్ లైసెన్స్ లేదు. పోలీసులు అతడిని పట్టుకుని జువెనైల్ హోమ్‌కు తరలించారు. కానీ  ఆ బాలుడికి 10వ తరగతి బోర్డు పరీక్షలు ఉన్నాయన్న కారణంతో జువెనైల్ జస్టిస్ బోర్డు (JJB) అతనికి  బెయిల్ మంజూరు చేసింది.

తల్లి ఆవేదన:
మరణించిన సాహిల్ తల్లి తన కొడుకుకు న్యాయం చేయాలని కోరుతూ కన్నీరుమున్నీరవుతున్నారు. ఆమె.. నిందితుడు అతని  సోదరితో కలిసి సోషల్ మీడియా రీల్స్ చేయడం కోసమే కారును అంత వేగంగా నడిపాడు. బస్సు ముందు స్టంట్లు చేస్తూ రాంగ్ రూట్‌లో వచ్చి సాహిల్ ప్రాణం తీశాడు. నిందితుడి తండ్రికి తన కొడుకు లైసెన్స్ లేకుండా కారు నడుపుతున్నాడని తెలిసినా ఆపలేదు. ఇప్పటికే ఆ కారుపై అతి వేగంగా నడిపినందుకు చాలా చలాన్లు ఉన్నాయని ఆమె ఆరోపించారు.

తండ్రిపై కూడా చర్యలు:
మైనర్ బాలుడు ప్రమాదం చేసినందున, మోటారు వాహనాల చట్టం ప్రకారం అతని తండ్రిపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడి తండ్రి పేరును కూడా ఛార్జిషీట్‌లో చేర్చనున్నారు. పోలీసులు సీసీటీవీ ఫుటేజీలు, వాహన పేపర్స్  సేకరించి దర్యాప్తు చేస్తున్నారు.