- మంత్రి జూపల్లిని కోరిన తెలంగాణ ఉద్యోగుల జేఏసీ
హైదరాబాద్, వెలుగు: ఎక్సైజ్ శాఖ నిజామాబాద్ డివిజన్ డిప్యూటీ కమిషనర్ (డీసీ) సోమిరెడ్డితో అనుచితంగా ప్రవర్తించిన కమిషనర్ హరికిరణ్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ ఉద్యోగుల జేఏసీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఈ మేరకు సోమవారం సెక్రటేరియట్‌లో రాష్ట్ర ఆబ్కారీ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావును జేఏసీ చైర్మన్ వి. లచ్చిరెడ్డి నేతృత్వంలోని ప్రతినిధి బృందం కలిసి వినతిపత్రం సమర్పించింది.
డిప్యూటీ కమిషనర్ సోమిరెడ్డి గత 30 ఏండ్లుగా ఆబ్కారీ శాఖలో వివిధ హోదాల్లో పనిచేస్తూ నిజాయతీగా సేవలందించారని గుర్తు చేశారు. కమిషనర్ హరికిరణ్ కేవలం సోమిరెడ్డిపై మాత్రమే కాకుండా, ఇతర అధికారులు, సిబ్బందిపై కూడా ఇదే తరహా వేధింపులకు పాల్పడుతున్నారని మంత్రికి వివరించారు. ఈ ఘటనపై తక్షణమే విచారణ కమిటీని ఏర్పాటు చేయాలని కోరారు. జేఏసీ విన్నపంపై మంత్రి జూపల్లి సానుకూలంగా స్పందించారు.

