- అగ్రికల్చర్ డైరెక్టర్ గోపీ వెల్లడి
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం రైతుల ఎరువుల అవసరాల కోసం ప్రవేశపెట్టిన మొబైల్ ఫెర్టిలైజర్ యాప్ ద్వారా 12.73 లక్షల మంది రైతులు యూరియా బుక్ చేశారని అగ్రికల్చర్ డైరెక్టర్ గోపీ వెల్లడించారు. యాప్ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటిదాకా -మొత్తం 50.48 లక్షల యూరియా బస్తాలు బుక్ కాగా, వీటిలో 46.13 లక్షల బస్తాలు ఇప్పటికే రైతులు కొనుగోలు చేశారని ఓ ప్రకటనలో వివరించారు. జిల్లాల వారీగా చూస్తే.. నల్గొండ జిల్లాలో అత్యధికంగా 1.67 లక్షల రైతులు 7.59 లక్షల బస్తాలు బుక్ చేశారని తెలిపారు.
వీటిలో 7.45 లక్షలు బస్తాలు కొనుగోలు అయ్యాయన్నారు. జగిత్యాల జిల్లాలో 1.38 లక్షల రైతులు 5.09 లక్షల బ్యాగులు బుక్ చేశారని వెల్లడించారు. మిగతా జిల్లాల్లోనూ రైతుల నుంచి మంచి స్పందన కనిపిస్తోందని వివరించారు. ఎరువుల కోసం డీలర్ షాపుల వద్ద జనాలు బారులు తీరడాన్ని నివారించి, రైతులు ఇంటి నుంచే యూరియా బుక్ చేసుకునేలా ఈ యాప్ రూపొందించినట్లు చెప్పారు. పట్టాదార్ పాస్ బుక్ హోల్డర్లు, భూమి సాగు చేస్తున్న కౌలు రైతులు యాప్ ద్వారా బుక్ చేసుకోవడానికి అర్హులన్నారు. రైతు బుక్ చేసుకునే యూరియా బస్తాల సంఖ్య అనేది సాగు చేస్తున్న పంట, విస్తీర్ణం, అగ్రివర్సిటీ సిఫార్సుల ఆధారంగా నిర్ణయిస్తామని గోపీ పేర్కొన్నారు.
