పులులపై నిఘా!..తాడోబా నుంచి స్పెషల్ టీమ్స్‌‌‌‌

పులులపై నిఘా!..తాడోబా నుంచి స్పెషల్ టీమ్స్‌‌‌‌
  • పలు జిల్లాల్లో పెరిగిన పులుల సంచారం
  • అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు పీసీసీఎఫ్ సువర్ణ సూచన

హైదరాబాద్, వెలుగు: పులుల సంరక్షణపై అటవీ శాఖ స్పెషల్ ఫోకస్ పెట్టింది. అటవీ ప్రాంతాల్లో సంచరిస్తున్న పులుల కదలికలను రాష్ట్ర అటవీ అధికారులతో పాటు మహారాష్ట్రలోని తాడోబా- అంధారి టైగర్ రిజర్వ్ (టీఏటీఆర్) బృందాలు ట్రాక్ చేస్తున్నాయి. ఆసిఫాబాద్, మంచిర్యాల, కామారెడ్డి, సిద్దిపేట, కరీంనగర్, భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో పులులు సంచరించినట్లు వాటి పాదముద్రల ద్వారా గుర్తించారు. అటవీ మార్గం నుంచి కొన్ని పులులు కరీంనగర్, పెద్దపల్లి, సిద్దిపేట జిల్లాల్లోకి ప్రవేశించినట్లు తెలుస్తోంది.

మహారాష్ట్రలోని బ్రహ్మపురి జిల్లాలో, తాడోబాలో పులుల సంతతి పెరగడంతో వాటి మధ్య అంతర్గత ఘర్షణలు తలెత్తున్నాయి. దీంతో కొత్త టెరిటరీ కోసం తెలంగాణలోకి వస్తున్నాయని ఫారెస్ట్ ఆఫీసర్లు చెబుతున్నారు. అలాగే, ఇది మేటింగ్ సీజన్ కూడా కావడంతో పులులు తోడు కోసం వస్తుంటాయని తెలిపారు. పులి కదలికలను పసిగట్టడానికి సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు. పులుల రక్షణ కోసం ప్రత్యేకంగా బేస్ క్యాంపులు, స్ట్రైక్ ఫోర్స్‌‌‌‌లను ఏర్పాటు చేశామని వెల్లడించారు.

అడవిలో కరెంట్‌‌‌‌ వైర్లు అమరిస్తే కఠిన చర్యలు: పీసీసీఎఫ్ సువర్ణ 

రాష్ట్రంలో పులుల సంచారం పెరిగిందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పీసీసీఎఫ్‌‌‌‌ సువర్ణ సూచించారు.‘‘పంట రక్షణ కోసం అక్రమ విద్యుత్ లలలల లవేయకూడదు. దీని వల్ల పులులకు, మనుషులకు ప్రాణహాని. అడవిలో విద్యుత్ వైర్లు అమర్చి పులులను చంపే వేటగాళ్లపై కఠిన చర్యలు తీసుకుంటాం. ఎలక్ట్రిక్ వైర్లు వాడకుండా రైతులపై అవగాహన కల్పిస్తున్నాం. తాబాడో నుంచి పులుల రాకపోకలు సాగిస్తున్నాయి. మేటింగ్ సీజన్ కావడంతో పులులు తోడు కోసం వస్తున్నాయి.

అటవీ సరిహద్దు గ్రామాల ప్రజలు, రైతులు ఒంటరిగా అడవిలోకి, పంట పొలాల వద్దకు వెళ్లొద్దు. పులి కనిపిస్తే వెంటనే అటవీ శాఖ అధికారులకు లేదా టోల్ ఫ్రీ నంబర్లకు సమాచారం ఇవ్వాలి. పులిని వెంబడించడం లేదా రాళ్లతో కొట్టడం వంటివి చేయొద్దు”అని ఆమె సూచించారు.