- ఆ మొత్తం నేరుగా పేరెంట్స్ఖాతాలోకే.. సర్వీస్ రూల్స్‌లో సవరణలు
- అయితే, తల్లిదండ్రులకు సొంత ఆదాయం, పెన్షన్, అద్దెలు ఉండొద్దని నిబంధన
- బడ్జెట్ సమావేశాల్లోనే బిల్లు.. ముసాయిదా రెడీ చేస్తున్న ప్రభుత్వం
- 2017లో అస్సాం తీసుకొచ్చిన ప్రణామ్ చట్టం నమూనా తీసుకున్న సర్కార్
హైదరాబాద్, వెలుగు: తల్లిదండ్రులను విస్మరించే ప్రభుత్వ ఉద్యోగుల ఆటకట్టించేందుకు రాష్ట్ర సర్కార్ అత్యంత కఠినమైన నిర్ణయంతో ముసాయిదాను సిద్ధం చేస్తోంది. వృద్ధాప్యంలో తల్లిదండ్రులను పట్టించుకోకుండా వదిలేసే వారి జీతం నుంచి ఏకంగా 15 శాతం కోత విధించేందుకు డ్రాఫ్ట్ రూపొందిస్తోంది. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించినట్టుగా త్వరలో జరగబోయే రాష్ట్ర బడ్జెట్ సమావేశాల్లోనే ఈ బిల్లును సభలో ప్రవేశపెట్టి ఆమోదం పొందేలా ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది.
ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్ విధానాల్లో బాధితుల నుంచి ఫిర్యాదు అందిన వెంటనే విచారణ జరిపేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకోసం ప్రతి ప్రభుత్వ ఉద్యోగి తమ సర్వీస్ రికార్డుల్లో తల్లిదండ్రుల పూర్తి వివరాలను విధిగా నమోదు చేయాలనే నిబంధనను తప్పనిసరి చేశారు. కట్ చేసిన సదరు జీతం మొత్తాన్ని ఉద్యోగి ప్రమేయంతో పనిలేకుండా నేరుగా తల్లిదండ్రుల బ్యాంకు ఖాతాల్లోనే జమ చేయనున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని శాశ్వత ఉద్యోగులతో పాటు కార్పొరేషన్లు, బోర్డులు, పబ్లిక్ సెక్టార్ యూనిట్లు, ఎయిడెడ్ విద్యాసంస్థల సిబ్బందికి ఇది వర్తించేలా డ్రాప్ట్ తుది దశకు చేరుకున్నది.
ఒకవేళ ఒకే తల్లిదండ్రులకు ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉండి, వారంతా ప్రభుత్వ కొలువుల్లో ఉంటే ఆ మొత్తాన్ని అందరి జీతాల నుంచి సమానంగా కట్ చేస్తారు. ఎలాంటి సొంత ఆదాయం, పెన్షన్, అద్దెలు లేకుండా పూర్తిగా పిల్లలపైనే ఆధారపడిన వృద్ధులకు మాత్రమే ఈ చట్టం ద్వారా ప్రయోజనం ఉండేలా చూడనున్నారు.
సర్వీస్ నిబంధనల్లో మార్పులు
రాజ్యాంగంలోని ఆర్టికల్ 309 ప్రకారం ఉద్యోగుల ప్రవర్తన, సర్వీస్ నిబంధనలపై చట్టాలు చేసే పూర్తి అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంటుంది. ఈ అధికారాల ఆధారంగానే ఉద్యోగుల సర్వీస్ రూల్స్‌ను సవరించడం లేదా ప్రత్యేక చట్టం తేవడం ద్వారా ఈ విధానాన్ని రాష్ట్రంలో పక్కాగా అమలు చేయనున్నారు. వాస్తవానికి దేశంలో ఇలాంటి చట్టాన్ని 2017లోనే తీసుకొచ్చిన మొట్టమొదటి రాష్ట్రంగా అస్సాంకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. అక్కడ 'అస్సాం ఎంప్లాయీస్ పేరెంట్స్ రెస్పాన్సిబిలిటీ అండ్ నార్మ్స్ ఫర్ అకౌంటబిలిటీ అండ్ మానిటరింగ్' (ప్రాణమ్) పేరుతో ఈ చట్టం సమర్థవంతంగా అమలవుతోంది. ఆ నమూనాలోనే ఇక్కడ కూడా చట్టం తెచ్చి, తల్లిదండ్రులతో పాటు దివ్యాంగులైన తోబుట్టువులను పట్టించుకోకపోయినా ఫిర్యాదు చేసే అవకాశాన్ని కల్పించనున్నారు.
బాధితులు తమ గోడును సంబంధిత శాఖాధిపతికి (హెచ్‌ఓడీ) లేదా ప్రభుత్వం నియమించిన నిర్ణీత అథారిటీకి నేరుగా ఫిర్యాదు చేయవచ్చు. ఫిర్యాదు అందిన వెంటనే సంబంధిత అధికారులు రంగంలోకి దిగి పారదర్శకంగా, నిష్పాక్షికంగా విచారణ జరిపి ఉద్యోగి నిజంగానే నిర్లక్ష్యం చేస్తున్నారని తేలితే ఉత్తర్వులు ఇస్తారు. ఈ ప్రక్రియను సాగదీయకుండా ఫిర్యాదు నమోదైన 60 రోజుల్లోగానే విచారణను వంద శాతం పూర్తి చేసి అధికారులు తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. సర్కారు ఖజానా నుంచి గ్రాంట్-ఇన్-ఎయిడ్ పొందే సంస్థల ఉద్యోగులను సైతం ఈ చట్టం పరిధిలోకి తీసుకురావాలని చూస్తున్నారు.
కేంద్ర చట్టానికి కాస్త భిన్నంగా..
కేవలం ప్రభుత్వ ఉద్యోగులకే కాకుండా దేశంలోని పౌరులందరికీ వర్తించేలా కేంద్ర ప్రభుత్వం గతంలోనే ఒక చట్టాన్ని తీసుకొచ్చింది. కన్నవారి సంరక్షణ కోసం 'ది మెయింటెనెన్స్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ పేరెంట్స్ అండ్ సీనియర్ సిటిజెన్స్ యాక్ట్-2007' పేరుతో దీనిని రూపొందించింది. ఈ చట్టం నిబంధనల ప్రకారం వృద్ధులైన తల్లిదండ్రులు తమ నెలవారీ ఖర్చుల నిమిత్తం పిల్లల నుంచి భరణం కోరుతూ నేరుగా ట్రిబ్యునల్‌ను ఆశ్రయించవచ్చు. బాధితుల వాదనలు విన్న అనంతరం వారికి ప్రతి నెలా నిర్దిష్ట మొత్తాన్ని చెల్లించాల్సిందిగా న్యాయస్థానం పిల్లలను ఆదేశించే అవకాశం ఈ చట్టంలో ఉంటుంది.
కోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినప్పటికీ పిల్లలు డబ్బులు చెల్లించడానికి నిరాకరిస్తే.. ఆ చర్యను నేరుగా కోర్టు ధిక్కరణ కింద పరిగణిస్తారు. అయితే, ఇక్కడ గమనించాల్సిన ప్రధాన విషయం ఏమిటంటే.. కేంద్ర చట్టంలో అస్సాం రాష్ట్రం తరహాలో ఆటోమెటిక్ జీతం కోత విధానం ఎక్కడా లేదు. సుదీర్ఘమైన న్యాయ పోరాటం చేయాల్సి రావడం, కోర్టుల చుట్టూ తిరగలేక చాలామంది వృద్ధులు కేంద్ర చట్టాన్ని సమర్థవంతంగా వినియోగించుకోలేకపోతున్నారు. అందుకే ఆ లోపాన్ని సవరించి, ప్రభుత్వ ఉద్యోగుల జీతాల నుంచి నేరుగా కోత విధించేలా రాష్ట్ర సర్కార్ చట్టం తెస్తోంది.
ఆటోమేటిక్‌గా పేరెంట్స్ అకౌంట్లోకి..
విచారణలో ఆరోపణలు వాస్తవమేనని తేలిన పక్షంలో సదరు ఉద్యోగి నెలవారీ వేతనం నుంచి 10 శాతం నుంచి 15 శాతం వరకు కచ్చితంగా కోత విధిస్తారు. కొడుకు లేదా కూతురు ఇష్టంతో సంబంధం లేకుండా ఆటోమెటిక్ విధానంలో ట్రెజరీ నుంచే ఆ నిధులను మళ్లించేలా సాఫ్ట్‌వేర్ అనుసంధానం చేస్తారు. ఈ చర్యలతో తల్లిదండ్రుల పోషణకు అవసరమైన ఆర్థిక భద్రత లభించడంతో పాటు ఉద్యోగుల్లో నైతిక బాధ్యత మరింతగా పెరుగుతుందని సర్కార్ భావిస్తోంది. అయితే, ఈ చట్టాన్ని కొందరు దుర్వినియోగం చేయకుండా ఉండేందుకు ప్రభుత్వం ముసాయిదాలో పక్కా షరతులను కూడా స్పష్టంగా పొందుపరిచింది. తల్లిదండ్రులకు సొంతగా ఎలాంటి ఆర్థిక వనరులు ఉండకూడదని, అప్పుడే వారు ఈ పథకం కింద లబ్ధి పొందేందుకు అర్హులవుతారని పేర్కొంది.
