హైదరాబాద్, వెలుగు: తార్నాక వద్ద శ్రీ దుర్గ పోచమ్మ దేవస్థానం చేపట్టిన ముఖద్వార నిర్మాణం చట్టప్రకారం జరిగిందో లేదో తేల్చాలని జీహెచ్‌ఎంసీని హైకోర్టు ఆదేశించింది. ఈ నిర్మాణంపై అందిన ఫిర్యాదుపై ఇరుపక్షాల వాదనలను విని చట్టప్రకారం నిర్ణయం తీసుకోవాలంది. ఎలాంటి అనుమతి లేకుండా చేపట్టిన నిర్మాణంపై ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోకపోవడాన్ని సవాలు చేస్తూ డి. చంద్రబాబు అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ ఎన్‌వీ శ్రవణ్‌కుమార్ విచారణ చేపట్టారు.
పిటిషనర్ ఇచ్చిన వినతిపత్రంపై చట్టప్రకారం విచారణ చేపట్టాలని, పిటిషనర్‌తోపాటు ప్రతివాదుల వాదనను వినాలని, అన్ని పత్రాలను పరిశీలించి చట్టప్రకారం నిర్ణయం తీసుకోవాలని జీహెచ్‌ఎంసీని ఆదేశించారు. ఒకవేళ అది అక్రమ నిర్మాణమని తేలితే దాన్ని కూల్చివేతకు చర్యలు తీసుకోవాలని, కూల్చివేత ఖర్చులను ఆలయం నుంచి రాబట్టాలని ఆదేశిస్తూ విచారణను ముగించారు.
