హైదరాబాద్, వెలుగు: ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల హాల్ టికెట్లను ఇంటర్ బోర్డు విడుదల చేసింది. ఈ నెల 25 నుంచి ప్రారంభం కానున్న పరీక్షలకు సంబంధించి ఫస్టియర్, సెకండియర్ విద్యార్థుల హాల్ టికెట్లను ఆయా కాలేజీల లాగిన్లలో అందుబాటులో ఉంచినట్లు బోర్డు సెక్రటరీ కృష్ణ ఆదిత్య గురువారం ఒక ప్రకటనలో వెల్లడించారు. ఇంటర్ పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా సుమారు 9.9 లక్షల మంది విద్యార్థులు హాజరుకానున్నారు.
విద్యార్థులు తమ హాల్ టికెట్లను సంబంధిత కాలేజీ ప్రిన్సిపాళ్ల నుంచి తీసుకోవాలని ఆయన సూచించారు. హాల్ టికెట్లలో ఏవైనా తప్పులు ఉంటే వెంటనే ప్రిన్సిపాళ్ల ద్వారా బోర్డు దృష్టికి తేవాలన్నారు. మరోవైపు, విద్యార్థులు తమ పరీక్షా కేంద్రాలను సులభంగా గుర్తించేందుకు వీలుగా హాల్ టికెట్లపై క్యూఆర్ కోడ్‌ను ప్రింట్ చేశారు.
