నాలుగు నెలల్లో 74,955 కోట్లు వచ్చినయ్

నాలుగు నెలల్లో  74,955 కోట్లు వచ్చినయ్
  • కాగ్ జులై రిపోర్ట్​లో వెల్లడి 

హైదరాబాద్, వెలుగు:  ఈ ఆర్థిక సంవత్సరం నాలుగు నెలల్లో రాష్ట్ర ఖజనాకు వచ్చిన మొత్తం రాబడి రూ.74,955.74 కోట్లుగా నమోదైంది. ఇది బడ్జెట్ అంచనాల్లో 26.32 శాతానికి సమానం. గత ఏడాది ఇదే కాలంలో నమోదైన 26.01 శాతంతో పోలిస్తే ఇది కొంత మాత్రమే ఎక్కువగా ఉంది. ఈ మేరకు జులై నెలకు కాగ్ నివేదిక రిలీజ్ చేసింది. రెవెన్యూ రాబడి రూ.50,270.25 కోట్లుగా ఉండగా, ఇది మొత్తం బడ్జెట్ అంచనాల్లో 21.88 శాతంగా ఉన్నట్టు నివేదిక  తెలిపింది. పన్నుల ద్వారా వచ్చిన ఆదాయం రూ.48,145.57 కోట్లుగా ఉంది.

 ఇందులో జీఎస్టీతో  రూ.16,882.08 కోట్లు వచ్చాయి. నాన్ -ట్యాక్స్ రెవెన్యూ రూ.1,334.21 కోట్లు, కేంద్ర గ్రాంట్ ఇన్ ఎయిడ్, ఇతర నిధులు కలిపి రూ.790.47 కోట్లు వచ్చాయి. రాష్ట్ర రెవెన్యూ లోటు రూ.12,564.77 కోట్లుగా నమోదైంది. ఫిస్కల్ లోటు రూ.24,669.88 కోట్లుగా ఉంది. ఇక అప్పులు రూ.24,685 కోట్లు తీసుకున్నారు. అయితే కేంద్రం రుణాల రీషెడ్యూల్​కు అనుమతి ఇవ్వడంతో ఆర్బీఐ నుంచి తక్కువ వడ్డీకి తీసుకుని ఆర్ఈసీ, పీఎఫ్​సీ వంటి వాటికి చెల్లింపులు చేస్తున్నారు. అందులో భాగంగానే అప్పులు ఎక్కువగా కనిపిస్తున్నాయని ఆర్థిక శాఖ అధికారులు వెల్లడించారు. కాగా, శుక్రవారం కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆర్బీఐ నుంచి రూ.6 వేల కోట్ల అప్పు తీసుకున్నది.