- మహిళా దినోత్సవం రోజున ప్రారంభం
- 14 ఏండ్లు నిండిన అమ్మాయిలకు ఫ్రీగా పంపిణీ
- గత నెల 28న లాంఛనంగా ప్రారంభించిన మంత్రి దామోదర
- పేరెంట్స్ పర్మిషన్ తప్పనిసరి అని గైడ్ లైన్స్ విడుదల చేసిన ఆరోగ్యశాఖ
హైదరాబాద్, వెలుగు: గర్భాశయ క్యాన్సర్ ను తరిమికొట్టేందుకు హెచ్‌పీవీ వ్యాక్సిన్ పంపిణీకి రాష్ట్ర ప్రభుత్వం ముహూర్తం ఫిక్స్ చేసింది. మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవం నుంచే రాష్ట్రవ్యాప్తంగా ఈ వ్వాక్సిన్ పంపిణీని షురూ చేయాలని ఆరోగ్య శాఖ నిర్ణయించింది. 14 ఏండ్లు నిండి... 15 ఏండ్ల లోపు ఉన్న అమ్మాయిలకు ఈ వ్యాక్సిన్ ను ఉచితంగా వేయనున్నారు. ఫస్ట్ మూడు నెలలు దీన్ని ఒక క్యాంపెయిన్ లా చేపట్టి, ఆ తర్వాత రొటీన్ ఇమ్యునైజేషన్ లిస్ట్ లో కలుపనున్నారు. అప్పటి నుంచి ప్రతి బుధ, శనివారాల్లో దవాఖాన్లలో ఈ టీకా అందుబాటులో ఉంటుంది. ఈ వ్యాక్సిన్ కార్యక్రమాన్ని గత నెల 28న రాష్ట్ర వైద్య ఆరోగ్య మంత్రి దామోదర రాజనర్సింహ లాంఛనంగా ప్రారంభించిన సంగతి తెలిసిందే.
యూ విన్ పోర్టల్లో రిజిస్ట్రేషన్
ఈ వ్యాక్సిన్ కోసం యూ-విన్ (U-WIN) పోర్టల్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. లేదా ఆధార్ కార్డు, స్కూల్ ఐడీ తీసుకొని సమీపంలో హెల్త్ సెంటర్ కు వెళ్లి వ్యాక్సిన్ తీసుకోవచ్చు. గార్డాసిల్ 4 అనే ఈ టీకాను ఎడమ చేతికి సింగిల్ డోస్ ఇస్తారు. వ్యాక్సిన్ వేశాక గుర్తుగా ఎడమ చేతి చూపుడు వేలికి ఇంకు గుర్తు పెడతారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు పీహెచ్‌సీలు, గవర్నమెంట్ హాస్పిటల్స్ లో ఈ ప్రోగ్రామ్ నడుస్తుంది. టీకా వేయించుకునే పిల్లలు ఖాళీ కడుపుతో అస్సలు రావొద్దని, టిఫిన్, అన్నం ఏదైనా తిని రావాలని సూచించారు.
ఫేక్ ప్రచారాన్ని నమ్మొద్దు...
హెచ్పీవీ వ్యాక్సిన్ తో పిల్లలు పుట్టరని, సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని జరిగే ప్రచారాన్ని నమ్మొద్దని వైద్య ఆరోగ్య శాఖ క్లారిటీ ఇచ్చింది. ఈ వ్యాక్సిన్ 2006 నుంచే వాడుకలో ఉన్నదని, గర్భాశయ క్యాన్సర్ ను అడ్డుకోవడంలో 93 శాతం ఎఫికసీతో పనిచేస్తదని స్పష్టంచేశారు. అయితే, ఈ వ్యాక్సిన్ బాలికలకు వేయాలంటే.. వ్యాక్సిన్ వేయాలంటే తల్లిదండ్రుల పర్మిషన్ లెటర్ తప్పనిసరి ఉండాలి. పెద్దల అనుమతి లేకుంటే వ్యాక్సిన్ వేయరు. టీకా వేశాక.. అరగంటసేపు అక్కడే అబ్జర్వేషన్ లో ఉండాల్సి ఉంటుంది.
