బంగాళాఖాతంలో అల్పపీడనం... దేశ వ్యాప్తంగా భారీ వర్షాలు

బంగాళాఖాతంలో  అల్పపీడనం... దేశ వ్యాప్తంగా భారీ వర్షాలు

 బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో దేశవ్యాప్తంగా ప‌లుచోట్ల భారీ వ‌ర్షాలు కురవనున్నాయి. బంగ్లాదేశ్ తీరంలో ఈశాన్య బంగాళాఖాతంలో  ఏర్పడిన అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా బలపడి .....   ఈశాన్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమై ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది. ఫలితంగా ఆగస్టు 3 వ తేదీ  నుంచి 6వ తేదీ వరకు వాయవ్య భారత దేశంలో వర్షపాతం పెరుగుతుందనీ.. రాబోయే మూడు రోజుల్లో ( ఆగస్టు 2,3,4)  కొంకణ్ తీరం, దానిని ఆనుకుని ఉన్న మధ్య మహారాష్ట్ర ప్రాంతాల్లో మోస్తారు నుంచి భారీ వ‌ర్షాలు కురుస్తాయ‌ని ఐఎండీ తెలిపింది. అలాగే, బంగ్లాదేశ్ లోని ఖేపుపారాకు తూర్పు-ఆగ్నేయంగా 160 కిలోమీటర్లు, పశ్చిమ బెంగాల్లోని దిఘాకు తూర్పున 420 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని ఐఎండీ పేర్కొంది. 

రుతుపవనాల సీజన్ ద్వితీయార్ధంలో వర్షపాతం 100 శాతం కంటే తక్కువగా ఉండే అవకాశం ఉంది. జూలైలో సాధారణం కంటే 13 శాతం అధిక వర్షపాతం నమోదు కాగా, దేశంలోని పలు ప్రాంతాల్లో మంచి వర్షపాతం నమోదైంది. ప‌లు ప్రాంతాల్లో వ‌ర‌ద‌లు సంభ‌వించాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రస్తుతం తీవ్ర అల్పపీడనంగా మారడంతో ఒడిశాలో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (IMD) తెలిపింది. సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని, మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లవద్దని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇది వాయువ్య దిశగా పయనించి బంగ్లాదేశ్ తీరాన్ని ఖేపుపరాకు తూర్పుగా దాటే అవకాశం ఉందనీ, ఆ తర్వాత మరో 24 గంటల్లో గంగా నది పశ్చిమ బెంగాల్ మీదుగా పశ్చిమ వాయువ్య దిశగా పయనించే అవకాశం ఉందని  వాతావరణ శాఖ స్పష్టం చేసింది.

ఈశాన్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో  గంటకు 25 కిలోమీటర్ల వేగంతో ఉత్తర వాయవ్య దిశగా కదులుతూ తీవ్ర అల్పపీడనంగా మారిందని భార‌త వాతావ‌ర‌ణ శాఖ (ఐఎండీ) తెలిపింది.  పశ్చిమ బెంగాల్, ఉత్తర ఒడిశా, ఉత్తర ఛత్తీస్ ఘఢ్, జార్ఖండ్, బీహార్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ ల‌లో ఆగస్టు 5వ తేదీ  వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ప్రయివేటు వాతావరణ సంస్థ స్కైమెట్ అంచనా వేసింది.  ఈ వర్షాభావ పరిస్థితుల వల్ల మూడు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయనీ, సీజనల్ లోటును తగినంతగా తగ్గిస్తుందని స్కైమెట్ వెదర్ తెలిపింది. ఆగస్టు, సెప్టెంబరు నెలల్లో వర్షపాతం సాధారణ పరిధిలోనే ఉంటుందనీ, దీర్ఘకాలిక సగటులో 94 నుంచి 106 శాతం మధ్య ఉంటుందని ఐఎండీ పేర్కొంది.