ప్రభుత్వాసుపత్రుల్లో డాక్టర్లు, స్టాఫ్‌‌ను నియమించడంలో సర్కార్ జాప్యం

ప్రభుత్వాసుపత్రుల్లో డాక్టర్లు, స్టాఫ్‌‌ను నియమించడంలో సర్కార్ జాప్యం
  • ప్రభుత్వం ఆశించిన   ఫలితాలు రావని కామెంట్
  • హాస్పిటల్స్​లో ఖాళీలు, అడ్జస్ట్​మెంట్లపై అసంతృప్తి
  • ప్రమోషన్లు, ఏజ్‌‌ హైక్‌‌, రిక్రూట్‌‌మెంట్ చేయాలని విజ్ఞప్తి‌‌

హైదరాబాద్, వెలుగు : గవర్నమెంట్ హాస్పిటల్స్​లో సరిపడా డాక్టర్లు, స్టాఫ్‌‌ను నియమించడంలో సర్కార్ జాప్యం చేస్తున్నది. సుమారు 70 హాస్పిటల్స్​కు ఒక్క పోస్టును కూడా మంజూరు చేయకుండా, పాత దవాఖాన్లలో పనిచేస్తున్న వారినే సర్దుబాటు చేసి సరిపెట్టే ప్రయత్నం చేస్తున్నది. ఇలా చేయడంతో ప్రభుత్వం ఆశిస్తున్న ఫలితాలు ఎలా సాధ్యం అవుతాయని డాక్టర్లు ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం పనిచేస్తున్న డాక్టర్ల ప్రమోషన్లు, ఖాళీల గుర్తింపు, కొత్త పోస్టుల మంజూరు, భర్తీపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నారు. ఈమేరకు హెల్త్ సెక్రటరీ రిజ్వీతో వైద్య విధాన పరిషత్‌‌ డాక్టర్లు సోమవారం భేటీ అయ్యారు. వైద్య విధాన పరిషత్​(వీవీపీ) హాస్పిటల్స్​లో 3,858 డాక్టర్ పోస్టులకుగానూ, ప్రస్తుతం 1,236 మంది మాత్రమే పనిచేస్తున్నారు. మిగిలిన పోస్టులన్నీ ఖాళీగా ఉన్నాయి. ఇదే విషయాన్ని సెక్రటరీతో జరిగిన మీటింగ్‌‌లో డాక్టర్లు ప్రస్తావించారు. ‘‘ఇన్ని పోస్టులు ఖాళీగా ఉంటే, ప్రభుత్వం ఆశించిన ఫలితాలు ఎట్ల  వస్తాయో చెప్పండి సర్‌‌‌‌’’ అంటూ హెల్త్ సెక్రటరీని డాక్టర్లు ప్రశ్నించినట్టుగా తెలిసింది. 

ప్రమోషన్లు, రిక్రూట్​మెంట్​పై హామీ

త్వరలోనే ప్రమోషన్లు ఇస్తామని, రిక్రూట్‌‌మెంట్ నోటిఫికేషన్‌‌ కూడా రిలీజ్​ చేస్తామని సెక్రటరీ హామీ ఇచ్చినట్లు డాక్టర్లు ‘వెలుగు’కు చెప్పారు. డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ పరిధిలో ఉండే 82 కమ్యూనిటీ హెల్త్ సెంటర్లను ఆరు నెలల కింద తెలంగాణ వైద్య విధాన పరిషత్ పరిధిలోకి బదిలీ చేశారు. అప్పటిదాకా ఈ హాస్పిటల్స్​లో పనిచేస్తున్న డాక్టర్లు, స్టాఫ్‌‌ను డీహెచ్ పరిధిలోని ఇతర పీహెచ్‌‌సీలకు ట్రాన్స్‌‌ఫర్ చేశారు. దీంతో ఈ 82 దవాఖాన్లలో స్టాఫ్‌‌ కొరత ఏర్పడింది. ఇందులో 12 హాస్పిటల్స్​కు పోస్టులు మంజూరు చేసిన ప్రభుత్వం, మిగిలిన 70 దవాఖాన్లకు ఇప్పటిదాకా ఒక్క పోస్టును కూడా మంజూరు చేయలేదు. వీవీపీ పరిధిలోని ఇతర హాస్పిటల్స్​లో పనిచేస్తున్న డాక్టర్లు, సిబ్బందినే ఈ 70 హాస్పిటల్స్​కు సర్దుబాటు చేస్తున్నారు.  

అడ్జస్ట్‌‌మెంట్లతో ఆగమాగం

వీవీపీకి బదిలీ అయిన ఒక్కో హాస్పిటల్‌‌లో 30 నుంచి వంద బెడ్లు ఉన్నాయి. ఈ హాస్పిటల్స్​కు సుమారు 3,500 పోస్టులు అవసరం అవుతాయని ఆఫీసర్లు అంచనా వేశారు. ఈ మేరకు కొత్త పోస్టులను మంజూరు చేయాలని సర్కార్‌‌‌‌కు విజ్ఞప్తి చేశారు. కానీ, పాత పోస్టులతోనే అటు.. ఇటూ అడ్జస్ట్ చేయాలని ఆఫీసర్లకు సర్కార్ సూచించింది. ఈ సూచన మేరకు వీవీపీ ఆఫీసర్లు మరో ప్రణాళిక రూపొందించారు. కొత్తగా ఏర్పాటైన మెడికల్ కాలేజీలు, వాటి అనుబంధ హాస్పిటల్స్​లో పనిచేస్తున్న వీవీపీ డాక్టర్లు, స్టాఫ్‌‌ను వీవీపీలోకి కొత్తగా వచ్చిన 70 హాస్పిటల్స్​కు ట్రాన్స్‌‌ఫర్ చేసేందుకు ఫైల్ సిద్ధం చేశారు. వీరిని ఇప్పుడే బదిలీ చేస్తే నేషనల్ మెడికల్ కమిషన్ నుంచి మెడికల్ కాలేజీలకు పర్మిషన్ రావడం అసాధ్యం అని డీఎంఈ ప్రభుత్వానికి వివరించారు. దీంతో ఈ ఆప్షన్‌‌ కూడా మూలకు పడింది. ఈ క్రమంలోనే డాక్టర్లంతా హెల్త్ సెక్రటరీని కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు.