
- రెండేళ్లుగా ముందుకు సాగని ప్రపోజల్స్
- బ్యూటిఫికేషన్ పేరుతో ఏడాది క్రితం మెరుగులు
- ఇటీవల వరదలకు కొట్టుకుపోయిన నిర్మాణాలు
హైదరాబాద్, వెలుగు : మూసీ బ్యూటిఫికేషన్ కాగితాలకే పరిమితమైంది. రెండేళ్లుగా అధికారులు అరకొర నిధులు, తాత్కాలిక పనులతో నెట్టుకొస్తున్నారు. ప్రతిపాదనలు ఉన్నా నిధుల్లేక పూర్తిస్థాయిలో పనులు మొదలుపెట్టడం లేదు. మూసీపై చేపట్టే తాత్కాలిక పనులతో నిధులు వృథా అవుతున్నాయే తప్ప బ్యూటిఫికేషన్ జరగడం లేదు. దశాబ్దాలుగా మూసీ నది బ్యూటిఫికేషన్ కాగితాల్లోనే కనిపిస్తోంది. సిటీలో 33 కి.మీ ప్రవహించే మూసీని టూరిస్టు హబ్‌గా మార్చేందుకు రూ. వేల కోట్లతో ప్రతిపాదనలు రూపొందించి ఆ తర్వాత చేతులు దులుపుకుంటున్నారు. ప్రభుత్వం నుంచి నిధులు రిలీజ్ కాకపోవడంతో అట్టహాసంగా రూపొందించిన ప్రణాళికలు అమలు కావడం లేదు. ఇప్పటివరకు రూ.16 వేల కోట్లు ఖర్చు చేస్తే గాని మూసీ ప్రక్షాళన సాధ్యం కాదనే అంచనాలు ఉండగా, ప్రభుత్వం ఇస్తామన్న ఆ నిధులను కూడా విడుదల చేయకుండా ఆలస్యం చేస్తోంది. మూసీ డెవలప్ మెంట్‌ను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నామని చెబుతున్న ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడంతో అధికారులు గందరగోళ పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే నిధులు ఎటూ సరిపోయేలా లేవని నాలుగేళ్లలో రూ.500 కోట్ల కేటాయింపులు జరిగినా30శాతం లోపే విడుదలయ్యాయని అధికారులు చెప్తున్నారు. ఈ లెక్కన మూసీ ప్రక్షాళన ప్రతిపాదనలకే పరిమితం కాక తప్పదంటున్నారు.
ఎఫ్టీఎల్ రూల్స్ బ్రేక్ చేసి..
ఏడాది కాలంగా మూసీ పరివాహక ప్రాంతంలో బ్యూటిఫికేషన్ పేరుతో అధికారులు నిర్మాణాలు చేపట్టారు. వాకింగ్ ట్రాక్స్గెజిబోలను ఏర్పాటు చేశారు. ఇటీవల కురిసిన భారీ వానలకు వరద నీరు పోటెత్తి నిర్మాణాలు దెబ్బతిన్నాయి. ఎఫ్టీఎల్ పాటించకుండా మూసీలో వేసిన వాకింగ్ ట్రాక్స్‌పై పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రచార ఆర్భాటం కోసం చేపట్టిన పనులతో ఒరిగేదేమి లేదనే విమర్శలు వస్తున్నాయి. కెమికల్ వేస్టేజ్ కలవకుండా, మూసీ పరివాహక ప్రాంతంలోని కబ్జాలను తొలగించకుండా ఎన్ని పనులు చేపట్టినా ఎలాంటి ప్రయోజనం ఉండదని సోషల్ వర్కర్లు పేర్కొంటున్నారు.